హైదరాబాద్, మేడ్చల్ కలెక్టరేట్ల ముట్టడికి యత్నించిన ఎస్ఎఫ్ఐ నేతలు

హైదరాబాద్, మేడ్చల్ కలెక్టరేట్ల ముట్టడికి యత్నించిన ఎస్ఎఫ్ఐ నేతలు
  • అరెస్ట్ చేసి పీఎస్​లకు తరలించిన పోలీసులు

బషీర్​బాగ్/శామీర్​పేట, వెలుగు:  కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీపై సర్కారు స్పందించాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రేటర్ వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు ఆధ్వర్యంలో లక్డీకపూల్​లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్లకు ఇప్పటికీ యూనిఫామ్, పుస్తకాలు అందలేదన్నారు.  ఇంటర్ కాలేజీలు, కేజీబీవీలు, గురుకులాల్లోనూ అదే పరిస్థితి ఉందని ఆయన ఆరోపించారు. పుస్తకాలు లేకుండా స్టూడెంట్లు ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు.  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని,  రాష్ట్రంలో ఫీజు రెగ్యులరేటరీ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించుకుంటే అన్ని జిల్లాల నుంచి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టరేట్​లోకి వెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన చేస్తున్న వారిని  పోలీసులు అరెస్ట్ చేసి ముషీరాబాద్ పీఎస్​కు తరలించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మమత, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ తదితరులు పాల్గొన్నారు. శామీర్​పేటలోని మేడ్చల్ కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్. మూర్తి ఆధ్వర్యంలో  ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి శామీర్​పేట పీఎస్​కు తరలించారు.

ALSOREAD:పులుల జతకు వేళాయే.. 3 నెలల పాటు ఏటీఆర్ లోకి నో ఎంట్రీ