గ్యారంటీల అమలు ఎప్పుడనేది అసెంబ్లీలో సీఎం చెబుతారు: షబ్బీర్ అలీ

గ్యారంటీల అమలు ఎప్పుడనేది అసెంబ్లీలో సీఎం చెబుతారు: షబ్బీర్ అలీ

 

  • విద్యుత్​, ఇరిగేషన్​, ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో మూడురోజులు చర్చ
  • మీడియా సమావేశంలోషబ్బీర్​ అలీ వెల్లడి
  • వీలైనంత త్వరగా నామినేటెడ్​ పోస్టుల భర్తీ: సంపత్​కుమార్

హైదరాబాద్​, వెలుగు: ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తున్నామని, మిగతా గ్యారంటీలను ఎప్పుడు, ఏయే తేదీల్లో అమలు చేస్తామో అసెంబ్లీలో సీఎం రేవంత్​రెడ్డి ప్రకటిస్తారని పీఏసీ కన్వీనర్​ షబ్బీర్​ అలీ అన్నారు. పీఏసీ సమావేశం అనంతరం ఆయన సంపత్​ కుమార్​తో కలిసి గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. గతంలో మెదక్​ నుంచి ఇందిరా గాంధీ పోటీ చేశారని గుర్తు చేశారు. పీఏసీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, విద్యుత్​ శాఖ పరిస్థితులను భట్టి విక్రమార్క వివరించారని అన్నారు. ఇరిగేషన్​ అవకతవకలపై మంత్రి ఉత్తమ్​ మాట్లాడారని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.95 వేల కోట్లు ఖర్చు చేసినా.. 95 వేల ఎకరాలు కూడా సాగులోకి రాలేదన్నారు.  పథకాల అమలులో కాంగ్రెస్​ కార్యకర్తలకూ ప్రాధాన్యం ఉంటుందన్నారు. విద్యుత్, ఇరిగేషన్​, ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో మూడు రోజుల పాటు చర్చ ఉంటుందని ఆయన చెప్పారు. లోక్​సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని ఏఐసీసీ సభ్యుడు సంపత్​ కుమార్​ అన్నారు. ఎన్నికలకు తమ కార్యాచరణ వెంటనే షురూ అవుతుందని స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల టర్మ్ రెండేండ్లు కావడంతో.. ప్రస్తుత ప్రభుత్వంలో రెండు సార్లు భర్తీ చేసే అవకాశం ఉంటుందని, వీలైనంత త్వరగా నామినేటెడ్​ పదవులను భర్తీ చేస్తామని తెలిపారు.