- 6 వికెట్ల తేడాతో ఓడిన ఇండియా
- చెలరేగిన హోప్, రూథర్‌ఫోర్డ్, షెఫర్డ్
- శాంసన్, తిలక్ పోరాటం వృథా
రాంచీ: పరుగుల వరదలా పారిన రెండో టీ20లో వెస్టిండీస్ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ షై హోప్ (45 బాల్స్‌లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (37 బాల్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 84) సునామీ ఇన్నింగ్స్ ఆడటంతో.. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో విండీస్ 6 వికెట్ల తేడాతో ఇండియాను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. టాస్ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 249/5 స్కోరు చేసింది. సంజూ శాంసన్ (41 బాల్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82), ఇషాన్ కిషన్ (22 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), శ్రేయస్ అయ్యర్ (18 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), తిలక్ వర్మ (18 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 నాటౌట్) దంచికొట్టారు. తర్వాత విండీస్ 18.3 ఓవర్లలో 252/4 స్కోరు చేసి గెలిచింది. హోప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
దంచుడే.. దంచుడు
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అభిషేక్ శర్మ (20) ఓ సిక్స్, రెండు ఫోర్లతో ఖాతా తెరిస్తే.. తర్వాత శాంసన్ 4, 6, 4తో టచ్‌లోకి వచ్చాడు. కానీ నాలుగో ఓవర్‌లో అభిషేక్ ఔట్‌తో తొలి వికెట్‌కు 42 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఐదో ఓవర్‌లో శాంసన్ 4, 6, 6, 4తో 22 రన్స్ దంచాడు. ఆరో ఓవర్‌లో క్యాచ్ ఔట్ నుంచి బయటపడి రెండు ఫోర్లతో 21 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. దాంతో పవర్‌ప్లేలో ఇండియా 79/1 స్కోరు చేసింది. రెండో ఎండ్‌లో ఇషాన్ కిషన్ 6, 4తో బ్యాట్ ఝుళిపించాడు. 10వ ఓవర్‌లో శాంసన్ 4, ఇషాన్ 6, 4, 4తో 20 రన్స్ వచ్చాయి. ఫలితంగా స్కోరు 127/1కి పెరిగింది. 12వ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన ఇషాన్‌ను తర్వాతి ఓవర్‌లో రోస్టన్ ఛేజ్ (3/24) ఔట్ చేశాడు. ఫలితంగా రెండో వికెట్‌కు 97 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. శివమ్ దూబే (7)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన శాంసన్ సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఈ ఇద్ధరు మధ్యలో ఫోర్లు కొడుతూ రన్‌రేట్ తగ్గకుండా చూశారు. అయితే ఏడు బాల్స్ తేడాలో దూబే, శాంసన్ వికెట్లు పడటంతో స్కోరు 162/4గా మారింది. చివర్లో కెప్టెన్ శ్రేయస్, తిలక్ ఫోర్లు, సిక్సర్ల జాతర చూపెట్టారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 33 బాల్స్‌లోనే 83 రన్స్ జోడించడంతో ఇండియా భారీ స్కోరు చేసింది.
కీలక భాగస్వామ్యం..
భారీ ఛేజింగ్‌ను విండీస్ కూడా దూకుడుగానే మొదలుపెట్టినా ఆరంభంలో వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లో మయాంక్ యాదవ్ (3/36) వరుస బాల్స్‌లో కామిల్ పూరన్ (4), హెట్‌మయర్ (0)ను ఔట్ చేశాడు. మళ్లీ ఆరో ఓవర్‌లో పావెల్ (24)ను దెబ్బకొట్టడంతో విండీస్ 58/3తో కష్టాల్లో పడింది. స్టార్టింగ్ నుంచి క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ షై హోప్, రూథర్‌ఫోర్డ్ ఇక్కడి నుంచి ఇండియా బౌలింగ్‌ను ఉతికేశారు. రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో మొదలైన రూథర్‌ఫోర్డ్ విధ్వంసం క్రమంగా పెరిగింది. 9వ ఓవర్‌లో సిక్స్‌తో హోప్ 24 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. తొలి పది ఓవర్లలో విండీస్ స్కోరు 122/3కి పెరిగింది. తర్వాత రూథర్‌ఫోర్డ్ 6, 4, 6తో 24 బాల్స్‌లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. దూకుడుగా ఆడుతున్న రూథర్‌ఫోర్డ్‌ను 15వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ (1/53) ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 120 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. చివర్లో వచ్చిన రొమారియో షెఫర్డ్ (34 నాటౌట్) కూడా బ్యాట్ ఝుళిపించాడు. హోప్‌తో కలిసి సిక్స్‌లు, ఫోర్లతో ఐదో వికెట్‌కు 74 రన్స్ జోడించి ఈజీగా గెలిపించాడు.
సంక్షిప్త స్కోర్లు: ఇండియా: 20 ఓవర్లలో 249/5 (శాంసన్ 82, తిలక్ 44*, ఛేజ్ 3/24). వెస్టిండీస్: 18.3 ఓవర్లలో 252/4 (హోప్ 102* రూథర్‌ఫోర్డ్ 84, మయాంక్ 3/36).
311ఒక క్యాలెండర్ ఏడాది (2026)లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి జట్టుగా ఇండియా రికార్డు సృష్టించింది. 2022లో 289 సిక్సర్లతో నెలకొల్పిన రికార్డును సవరించుకుంది.
