వచ్చే నెల 6 నుంచి భద్రాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు

వచ్చే నెల 6 నుంచి భద్రాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వచ్చే నెల 6 నుంచి 15 తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శివాజీ చెప్పారు. ఆలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారు 6న ఆదిలక్ష్మి, 7న సంతానలక్ష్మి, 8న గజలక్ష్మి, 9న ధనలక్ష్మి, 10న ధాన్యలక్ష్మి, 11న విజయలక్ష్మి, 12న ఐశ్వర్యలక్ష్మి, 13న వీరలక్ష్మి, 14న మహాలక్ష్మి అలంకారాల్లో దర్శనం ఇవ్వనున్నట్లు వివరించారు. ఈసారి ఉత్సవాల్లో భాగంగా సంక్షేప రామాయణ హవనాన్ని విశేషంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. నిత్యం అమ్మవారికి అభిషేకం, చిత్రకూట మండపంలో సామూహిక శ్రీరామాయణ పారాయణం, లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో సామూహిక లక్ష కుంకుమార్చన, దర్బారు సేవ, శ్రీరామాయణ ప్రవచనాలు, తిరువీధి సేవలు ఉంటాయని వెల్లడించారు. 15న విజయదశమి సందర్భంగా శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహించి సాయంత్రం ఏరియా ఆసుపత్రి సమీపంలోని దసరా మండపంలో శమీ పూజ, శ్రీరామలీలా మహోత్సవం నిర్వహిస్తామని చెప్పారు.