షర్మిల పార్టీ జెండా రెడీ?

షర్మిల పార్టీ జెండా రెడీ?
  • మూడు రంగులు.. మధ్యలో తెలంగాణ, వైఎస్సార్ ఫొటో.. 
  • వారంలో డిజైన్లు పూర్తి చేయాలని అనుచరులకు ఆదేశం
  • పార్టీ ఆఫీసు నిర్మాణానికి నిర్ణయం? 

హైదరాబాద్, వెలుగు: వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ కి జెండా ఖరారైనట్టు తెలుస్తోంది. గురువారం ఆమె జెండా డిజైన్ను ఫైనల్  చేసినట్టు సమాచారం. లేత ఆకుపచ్చ, తెలుపు, నీలి రంగుతో  జెండాను రూపొందించినట్లు తెలిసింది. జెండా మధ్యలో తెలంగాణ చిత్ర పటం, అందులో వైఎస్సార్ ఫొటో ఉండేలా డిజైన్  చేయనున్నట్టు సమాచారం. మరో వైపు పార్టీ కోసం ఆఫీసును కూడా నిర్మించాలని భావిస్తున్నారు. హైదరాబాద్ శివారులో, మెట్రో రైల్ రూట్కు దగ్గరగా  2 ఎకరాల్లో పార్టీ ఆఫీసును ఏర్పాటు చేసేందుకు ల్యాండ్ చూడాలని అనుచరులకు షర్మిల చెప్పినట్లు సమాచారం. ల్యాండ్  ఓకే  కాగానే బిల్డింగ్ నిర్మాణం స్టార్ట్ చేసి త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. 

అనుచరులతో షర్మిల మీటింగ్ 
పార్టీ ఏర్పాటుపై గురువారం హైదరాబాద్లోని లోటస్ పాండ్ లో షర్మిల పలువురు అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ ని వచ్చే నెల 9న ప్రకటించాలని భావిస్తుండగా, అంతకు ముందే గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కమిటీల ఏర్పాటు బాధ్యతను పిట్టా రాంరెడ్డికి షర్మిల అప్పగించారు.  

పార్టీలోకి ఏపూరి సోమన్న
కాంగ్రెస్ నేత, ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న షర్మిల పార్టీలో చేరనున్నారు. ఈ నెల 15న తన నియోజకవర్గం తుంగతుర్తి  నుంచి 500 మంది కళాకారులతో షర్మిలను కలువనున్నట్లు ఆయన గురువారం ఫేస్బుక్లో ప్రకటించారు. కాంగ్రెస్ ను విమర్శించే ఆలోచన తనకు లేదని, ఆ పార్టీపై తనకు నమ్మకం లేదని తెలిపారు. తుంగుతుర్తి నుంచి పోటీ చేయాలన్న తన కోరికకు కాంగ్రెస్ సహకరించలేదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు కాంగ్రెస్ కోసం పనిచేశానని చెప్పారు. కాంగ్రెస్ను సోమన్న వీడనున్నారన్న విషయం తెలుసుకొని పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆయనకు ఫోన్ చేశారు. తాను ఢిల్లీలో ఉన్నానని, త్వరలో కలిసి మాట్లాడుదామని అన్నట్లు తెలుస్తోంది. మాట్లాడానికి ఏమీలేదన్న సోమన్న చెప్పినట్లు సమాచారం.