బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్

బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి  వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని కోరారు.  ఉమ్మడి కార్యాచారణ చేద్దామని  చెప్పిన  షర్మిల.. ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపునిద్దామని సూచించారు.  కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలన్నారు.  కలిసి పోరాటం చేయకపోతే   ప్రతిపక్షాలను రాష్ట్రంలో కేసీఆర్ బతకనియ్యడని షర్మిల అన్నారు.  షర్మిలకు  మద్దతు  తెలిపిన బండి సంజయ్ త్వరలో  సమావేశమవుదామని చెప్పారు.  పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ బదులిచ్చారు. షర్మిల మార్చి 31న  టీఎస్ పీఎస్ సీ ముట్టడికి బయల్దేరగా ఆమెను అరెస్ట్ చేశారు. 

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ తో పలు పరీక్షల్ని రద్దు చేయడంతో  లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. వారి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ఈ కేసులో కేటీఆర్ ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ,కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాయి.   ప్రతిపక్షాలు ఎవరికి వారు పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సీఎం  కేసీఆర్ పేపర్ లీక్ ఘటనపై నోరు మెదపడం లేదు. మరి నిరుద్యోగుల సమస్యలపై ప్రతిపక్షాలు ఏకమవుతాయా? కలిసి పోరాటం చేస్తాయా? అనేది చూడాలి?