ఎల్బీనగర్, వెలుగు: మహిళలు, చిన్నారులపై జరుగుతున్న వేధింపులు, నేరాలను అరికట్టేందుకు ప్రవర్తనలో మార్పు ఎంతో అవసరమని మల్కాజిగిరి సీపీ బి. సుమతి స్పష్టం చేశారు. నాగోల్లో శుక్రవారం షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సంస్కార్ మెగా కౌన్సెలింగ్ ప్రోగ్రామ్”లో ఆమె మాట్లాడారు. మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని, సమాజంలో స్త్రీ, పురుషులు సమానమని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 18 వరకు మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్ల పరిధిలో షీ టీమ్స్ 61 ఎఫ్‌ఐఆర్‌లు, 236 పెట్టీ కేసులు నమోదు చేసి, మొత్తం 760 మందిని అదుపులోకి తీసుకున్నామని, అందులో 137 మంది మైనర్లు, 384 మంది 24 ఏళ్ల లోపు యువకులే ఉండటం ఆందోళనకరమన్నారు.
తప్పు చేసిన వారు కౌన్సెలింగ్ ద్వారా తమ ప్రవర్తనను మార్చుకుని బాధ్యతాయుత పౌరులుగా మారాలని, లేదంటే పోలీసు రికార్డుల్లో పేరు నమోదు కావడం వల్ల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. మైనర్లు, పెద్దల్లో దీర్ఘకాలిక మార్పు కోసం ఫాలోఅప్ కౌన్సెలింగ్ కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సైకాలజిస్ట్ గీతా చల్లా బృందం భావోద్వేగ నియంత్రణపై కౌన్సెలింగ్ ఇవ్వగా, న్యాయ నిపుణులు బీఎన్‌ఎస్, పోక్సో, ఐటీ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీపీలు డాక్టర్ బి. అనురాధ, టి. ఉషారాణి, అదనపు డీసీపీలు, షీ టీమ్స్ ఏసీపీ పి. వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్, కౌన్సెలింగ్ నిపుణులు, నిందితుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
