RCB vs PBKS: 17 ఏళ్లలో ఒక్కడే: ఐపీఎల్‌లో ధావన్ సరికొత్త చరిత్ర

RCB vs PBKS: 17 ఏళ్లలో ఒక్కడే: ఐపీఎల్‌లో ధావన్ సరికొత్త చరిత్ర

ఐపీఎల్ లో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ కు ప్రత్యేక స్థానం ఉంది. 2008 నుంచి ఇప్పటివరకు నిలకడగా రాణించే అతి కొద్ది మంది ప్లేయర్లలో ధావన్ ఒకడు. ఇప్పటివరకు 200 వందలకు పైగా మ్యాచ్ ల్లో 6000 లకు పైగా పరుగులు సాధించాడు. వీటిలో రెండు సెంచరీలతో పాటు ఏకంగా 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో తన పేరు మీద ఎన్నో రికార్డులు లిఖించుకున్న గబ్బర్.. తాజాగా ఎవరికీ సాధ్యం కాని ఘనతను అందుకున్నాడు.
      
ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ధావన్ అరుదైన రికార్డ్ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 900 ఫోర్లు కొట్టిన తొలి ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. ధావన్ తర్వాత స్థానంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 878 ఫోర్లతో రెండో స్థానంలో నిలిచాడు. వార్నర్ (877), రోహిత్ (811) వరుసగా మూడు నాలుగు స్థానాల్లో నిలిచారు. 

ఈ మ్యాచ్ కు ముందు 897 ఫోర్లతో ఉన్న శిఖర్.. ఈ మ్యాచ్ లో 5 ఫోర్లు బాదాడు. దీంతో అతని ప్రస్తుత ఐపీఎల్ ఫోర్ల సంఖ్య 902 కు చేరింది. మొత్తం 37 బంతులు ఎదుర్కొన్న ఈ స్టార్ ఓపెనర్ 45 పరుగులు చేసి ఔటయ్యాడు. ధావన్ రాణించడంతో పంజాబ్ ప్రస్తుతం 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.