V6 News

ఏడాదిలో కొత్తగా 92 నౌకలు.. షిప్పింగ్ మినిస్టర్‌‌ సర్బానంద సోనోవాల్‌

ఏడాదిలో కొత్తగా 92 నౌకలు.. షిప్పింగ్ మినిస్టర్‌‌ సర్బానంద సోనోవాల్‌

న్యూఢిల్లీ: కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 92 నౌకలను జోడించడానికి రూ.51,383 కోట్ల పెట్టుబడితో రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తోందని షిప్పింగ్‌ మినిస్టర్‌‌ సర్బానంద సోనోవాల్‌ తెలిపారు. దీని ద్వారా 28.5 లక్షల గ్రాస్‌ టన్నేజ్ (జీటీ) కెపాసిటీ పెరుగుతుందని అన్నారు.  హార్మూజ్‌ పరిస్థితుల నేపథ్యంలో మారిటైమ్‌ సమస్యలు, లక్ష్యాలు, రోడ్‌మ్యాప్‌పై  ఒక  వైట్‌పేపర్‌ సిద్ధం చేయాలని ఇంటర్‌‌- మినిస్ట్రియల్‌ రివ్యూ మీటింగ్‌లో ఆయన ఆదేశించారు. 

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఎస్‌సీఐ) ప్రత్యేకంగా అమోనియా రవాణా నౌకలను  నిర్మించగలదని సోనోవాల్‌ అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో పెట్రోలియం, ఎరువులు, షిప్పింగ్‌, విదేశీ వాణిజ్య శాఖల అధికారులు పాల్గొన్నారు. సోనోవాల్‌ మాట్లాడుతూ, “కంటైనర్‌ వెసల్స్‌, ఎల్‌పీజీ క్యారియర్లు, క్రూడ్‌ క్యారియర్లు, గ్రీన్‌ టగ్స్‌ వంటి నౌకలను విస్తరించడం అత్యవసరం. సప్లయ్ చెయిన్‌ సేఫ్టీ కోసం ఇది కీలకం” అని తెలిపారు. ఎస్‌సీఐ–ఆయిల్‌ పీఎస్‌యూల జాయింట్‌ వెంచర్‌ ద్వారా 59 నౌకలను కొనుగోలు చేసే ప్రణాళికను కూడా ఆయన సమీక్షించారు.