తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా.. మహారాష్ట్రకు జిష్ణుదేవ్ వర్మ

తెలంగాణ గవర్నర్గా  శివప్రతాప్ శుక్లా.. మహారాష్ట్రకు జిష్ణుదేవ్ వర్మ
  • తమిళనాడు గవర్నర్ బెంగాల్​కు బదిలీ
  • పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పు.. రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మరికొందరిని బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ల నియామకం, బదిలీలపై గురువారం రాష్ట్రపతి భవన్  ఒక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్  గవర్నర్  సీవీ ఆనంద్ బోస్  తన పదవికి రాజీనామా చేయడంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. బోస్  రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తెలంగాణ కొత్త గవర్నర్​గా శివ ప్రతాప్  శుక్లా నియమితులయ్యారు. 

ఆయన ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్  గవర్నర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన శుక్లా 2014 ఎన్డీఏ కేబినెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి గా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ ను కేంద్రం మహారాష్ట్ర గవర్నర్ గా నియమించింది. 2024 జులై 31 నుంచి జిష్ణుదేవ్ వర్మ ఏడాదిన్నార పాటు తెలంగాణ గవర్నర్ గా విధులు నిర్వర్తించారు. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్పులు చేశారు. 

తమిళనాడు గవర్నర్ గా ఉన్న ఆర్ఎన్  రవిని పశ్చిమ బెంగాల్ కు బదిలీ చేశారు. బిహార్  గవర్నర్ గా లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్  అతా హస్నైన్ (రిటైర్డ్), నాగాలాండ్  గవర్నర్ గా నంద కిశోర్ యాదవ్  నియమితులయ్యారు. కేరళ గవర్నర్ గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ ఆర్లేకర్ కు తమిళనాడు గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. లద్దాఖ్  లెఫ్టినెంట్  గవర్నర్  కవీందర్  గుప్తాను హిమాచల్ ప్రదేశ్ కు, ఢిల్లీ లెఫ్టినెంట్  గవర్నర్  వినయ్ సక్సేనాను లద్దాఖ్  లెఫ్టినెంట్ గవర్నర్ గా బదిలీ చేశారు. మాజీ  రాయబారి తరణ్​జిత్ సింగ్  సంధూను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌‌గా నియమించారు. కొత్తగా నియమితులైన వారు బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయి.