బాలాపూర్‌‌‌‌ నుంచి హుస్సేన్​సాగర్‌‌ వరకు శోభాయాత్ర

బాలాపూర్‌‌‌‌ నుంచి హుస్సేన్​సాగర్‌‌ వరకు శోభాయాత్ర
  • 21 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
  • 25 వేల మంది పోలీసులు, సీసీ కెమెరాలతో నిఘా
  • మధ్యాహ్నం 2 గంటలలోపే బడా గణేశ్​ నిమజ్జనం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో గణపతి నిమజ్జనానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం బాలాపూర్ నుంచి హుస్సేన్​సాగర్​ వరకు 21 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా 25 వేల మంది పోలీసులు, సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. బాలాపూర్‌‌ గణనాథునికి ఉదయం 5 గంటలకు చివరి పూజలు చేసి ఊరేగిస్తారు. ఉదయం 10 గంటలకు లడ్డూ వేలం ఉంటుంది. హనుమాన్‌‌ టెంపుల్‌‌ లో ప్రత్యేక పూజల తర్వాత శోభాయాత్ర మొదలవుతుంది. చాంద్రాయణగుట్ట వద్ద సిటీ కమిషనరేట్‌‌ లిమిట్స్‌‌లో ఇది కలుస్తుంది. అక్కడి నుంచి హుస్సేన్‌‌సాగర్‌‌‌‌ వరకు 18 కిలోమీటర్లు యాత్ర సాగుతుంది. 

నేడే నిమజ్జనం

రాచకొండ కమిషనరేట్‌‌ పరిధిలోని సరూర్‌‌‌‌నగర్‌‌‌‌ మినీ ట్యాంక్‌‌ బండ్‌‌, సఫీల్‌‌గూడ, సైబరాబాద్‌‌ లిమిట్స్‌‌లోని కూకట్‌‌పల్లి ఐడీఎల్‌‌ చెరువు, షేక్‌‌పేట్‌‌ మల్కం చెరువుతో పాటు 74 బేబీ పాండ్స్‌‌ వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. పాతబస్తీపై స్పెషల్‌‌ ఫోకస్ పెట్టారు.  

మధ్యాహ్నం 2 గంటలలోపే..

ఖైరతాబాద్ బడా గణేశ్​ నిమజ్జనం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలోపే పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. గురువారం మధ్యాహ్నమే బడా గణపతి చుట్టూ ఉన్న కర్రలు తొలగించి భారీ క్రేన్‌‌తో కనెక్ట్‌‌ చేశారు. ఉదయం 5 గంటలకు పూజలు చేసి 7 గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభిస్తారు. టెలిఫోన్‌‌ భవన్‌‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్​ రూట్‌‌లో ఎన్టీఆర్ మార్గ్ కు తరలిస్తారు. క్రేన్‌‌ నంబర్‌‌‌‌ 4 వద్ద బడా గణేశ్​ నిమజ్జనం చేస్తారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. మూడు కమిషనరేట్ల పరిధిలో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా, సిటీలో జరగనున్న గణేశ్ నిమజ్జనంలో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పాల్గొననున్నారు. భాగ్యనగర్ గణేశ్​ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు గురువారం సాయంత్రమే ఆయన హైదరాబాద్​ చేరుకున్నారు. శుక్రవారం ట్యాంక్ బండ్ వద్ద గణేశ్  నిమజ్జన ర్యాలీలో ఆయన పాల్గొంటారు.