హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం జరిగింది. కూతురును లవ్ చేశాడని తెలిసి.. పెళ్లి గురించి మాట్లాడదామని ఆమె లవర్ను ఇంటికి పిలిపించి అమ్మాయి తల్లిదండ్రులు అతనిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంజనీరింగ్ స్టూడెంట్ జ్యోతి శ్రావణ్ సాయిని హత్య చేసిన ఘటన అమీన్‌పూర్ పరిధిలోని లక్ష్మీనగర్‌లో వెలుగులోకి వచ్చింది.
జ్యోతి శ్రావణ్ సాయి(20), బీరంగూడ ఇసుకబావికి చెందిన శ్రీజ (19) గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉండడంతో అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురిని ప్రేమించొద్దని పలుమార్లు సాయిని హెచ్చరించారు. అయినప్పటికీ శ్రావణ్ సాయి, శ్రీజ తమ ప్రేమను కొనసాగించారు. ఈ విషయం శ్రీజ తల్లిదండ్రులకు తెలిసింది. సాయిపై పగ పెంచుకున్న శ్రీజ ఫ్యామిలీ ఇద్దరికీ మ్యారేజీ చేస్తామని, మాట్లాడుకుందామని అతనిని ఇంటికి పిలిపించారు. ఇంటికి పిలిచి ఒక్కసారిగా సాయిపై దాడి చేశారు.
ALSO READ : వారాసిగూడ పవిత్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..
విచక్షణా రహితంగా అతనిని కొట్టడంతో శ్రావణ్ సాయికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఇంట్లోకి లాక్కెళ్లి మరీ దాడి చేశారు. దెబ్బలకు తాళలేక విలవిలలాడిపోయిన శ్రావణ్ సాయి ప్రాణాలు కోల్పోయాడు. జ్యోతి శ్రావణ్ సాయి మైసమ్మ గూడలోబి సెయింట్ పీటర్ కాలేజీలో బీటెక్ సీఎస్ఈ సెకండియర్ చదువుతున్నాడు. కుత్బుల్లాపూర్లో రూం తీసుకుని జ్యోతి శ్రావణ్ సాయి ఉంటున్నాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

