మొదటి భార్య చచ్చిపోయిందనుకుని.. ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిపోయాడు.. కానీ ఊహించనిది జరిగింది !

మొదటి భార్య చచ్చిపోయిందనుకుని.. ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిపోయాడు.. కానీ ఊహించనిది జరిగింది !

పెద్దపల్లి జిల్లా: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో దారుణం జరిగింది. భార్యను హతమార్చడానికి భర్త యత్నించిన ఘటన కలకలం రేపింది. మొదటి భార్య నూనె పద్మను జాఫర్ ఖాన్ పేట శివారుకు తీసుకువెళ్లి ఆమె భర్త నూనె వెంకటేష్ బండరాయితో తలపై బాదాడు. చనిపోయిందని భావించి చెట్లపొదల్లో పడేసి వెళ్ళిపోయాడు.

పద్మ కనిపించకపోవడంతో పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో భర్త వెంకటేష్పై అనుమానం ఉందని పద్మ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేష్ను అదుపులోకీ తీసుకొని విచారించారు. జాఫర్ ఖాన్ పేట శివారులోకి తీసుకువెళ్లి బండరాయితో కొట్టి పడవేశానని వెంకటేష్ ఒప్పుకున్నాడు. జాఫర్ ఖాన్ పేట గుట్టకు వెళ్లి మృతదేహం కోసం వెతికిన పోలీసులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పద్మను చూసి పోలీసులు విస్తుపోయారు. 

పద్మను హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 24 గంటలకు పైగా ముళ్ళ పొదల్లోనే  అచేతన స్థితిలో పద్మ ఉండటం గమనార్హం. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల తక్షణ స్పందనతో పద్మ ప్రాణం దక్కింది. మంచిర్యాలకు చెందిన పద్మను 15 సంవత్సరాల క్రితం వెంకటేష్ వివాహం చేసుకున్నాడు.

గత ఏడేండ్లుగా కోర్టులో విడాకుల కేసు నడుస్తుంది. మొదటి భార్య వద్దని వెంకటేష్ రెండవ పెళ్లి చేసుకున్నాడు. నిన్న (శుక్రవారం) కోర్టులో కేసు ఉండడంతో భర్త వెంకటేష్, మొదటి భార్య పద్మ కోర్టుకు వెళ్ళారు. కోర్టు ముగిశాక మాట్లాడుకుందామని చెప్పి పద్మను బైక్పై ఎక్కించుకొని వెళ్లి వెంకటేష్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.