సాధారణంగా ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పుడో.. లేదా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పుడో అవార్డులు రావడం సహజం. కానీ అసలు థియేటర్ గడప కూడా తొక్కిని, కనీసం ఓటీటీలో కూడా విడుదల కాని ఒక చిత్రానికి ఏకంగా మూడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు వరించాయి. వినడానికి వింతగానే ఉన్నా.. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటనలో ఇదే జరిగింది. నటుడు విమల్, శ్రియ శరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సండకారి’ (Sandakari) చిత్రం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నెట్టింట పెద్ద దుమారం రేపుతోంది.
అసలు ఏం జరిగింది?
ఇటీవల తమిళనాడు ప్రభుత్వం 2016 నుండి 2022 వరకు పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో ఎందరో అగ్ర నటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకున్నారు. అయితే, 2020 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన అవార్డుల్లో ‘సండకారి’ చిత్రం పేరు మూడు విభాగాల్లో కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు. వాటిల్లో ఉత్తమ చిత్రంగా తృతీయ బహుమతి, ఉత్తమ నేపథ్య గాయకుడుగా అమ్రిష్, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ అయ్యప్పన్ అవార్డులు వరించాయి.
విడుదల కాని సినిమాకు అర్హత ఎలా?
సాధారణంగా ఏదైనా ప్రభుత్వ అవార్డుకు సినిమా అర్హత సాధించాలంటే, అది ఆ నిర్దేశిత సంవత్సరంలో సెన్సార్ పూర్తి చేసుకుని, థియేటర్లలో విడుదల కావాలి. కానీ ‘సండకారి’ చిత్రం ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. కేవలం టీజర్, ట్రైలర్‌లతోనే సరిపెట్టుకున్న ఈ సినిమాకు అవార్డులు ఎలా ఇచ్చారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. తమిళనాట పెద్ద చర్చే నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఈ సినిమాను జ్యూరీ సభ్యులు ఎక్కడ చూశారు? విడుదల కాని సినిమా ఉత్తమ చిత్రంగా ఎలా ఎంపికైంది? అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
రీమేక్ సినిమాకు అవార్డుల పంటా?
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ‘సండకారి’ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘మై బాస్’ (My Boss) సినిమాకు రీమేక్. అసలే రీమేక్, ఆపై విడుదల కాని సినిమా.. ఇలాంటి చిత్రానికి ఒరిజినల్ సినిమాలను పక్కన పెట్టి మరీ మూడు అవార్డులు కట్టబెట్టడం వెనుక మతలబు ఏంటని సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శ్రియ శరణ్ చాలా కాలం తర్వాత తమిళంలో నటించిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఉన్నప్పటికీ, ఈ వివాదం సినిమా ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉంది.
సమాధానం లేని ప్రశ్నలు..
తమిళనాడు రాష్ట్ర అవార్డుల ఎంపికపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది. కానీ ఈసారి ఏకంగా సినిమా ఉనికిపైనే చర్చ జరుగుతోంది. ఈ వివాదంపై అటు చిత్ర యూనిట్ గానీ, ఇటు అవార్డుల ఎంపిక కమిటీ గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. అనేక అద్భుతమైన ఒరిజినల్ చిత్రాలు, చిన్న సినిమాలు అవార్డుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. ఇలాంటి అస్పష్టమైన నిర్ణయాలు ప్రభుత్వ అవార్డుల విలువను తగ్గిస్తాయని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ‘సండకారి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించని గుర్తింపును, ఈ అవార్డుల వివాదం ద్వారా సంపాదించుకుంది.
