కుళ్లిపోయిన గుడ్లు, నల్లగా కందెనలా మారిన నూనె.. హైదరాబాద్లో ఈ సమోసాలు తింటే ఇంకేమైనా ఉందా

కుళ్లిపోయిన గుడ్లు, నల్లగా కందెనలా మారిన నూనె.. హైదరాబాద్లో ఈ సమోసాలు తింటే ఇంకేమైనా ఉందా

హైదరాబాదీలకు స్నాక్స్ అంటే టక్కున గుర్తొచ్చేవి సమోసాలు. తక్కువ ధరలో ఆకలి తీర్చుకునేందుకు, రుచికరంగా, ఈజీగా క్యారీ చేసేందుకు వీలుగా ఉండే సమోసాలంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సిటీలో అత్యధికంగా అమ్ముడుపోయే సమోసాల తయారీ గురించి తెలిస్తే మాత్రం తినాలా వద్దా అని ఒకసారి ఆలోచిస్తారు. మనుషుల ఆరోగ్యాలను ఏం చేయాలనుకున్నారో కానీ.. ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం (మార్చి 20) నిర్వహించిన తనిఖీల్లో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్, కుల్సుంపురా పోలీసుల సమన్వయంతో జియాగూడలోని అక్రమ ఆహార తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేశారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో జియాగూడలోని ఎస్.బి.ఏ (SBA) గార్డెన్ ఎదురుగా ఉన్న ఇంటి నంబర్ 13-4-582/A/B/30 ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో సదరు తయారీ కేంద్రం ఎటువంటి FSSAI లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ లేదా ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు అబ్దుల్ రషీద్ (73 ఏళ్లు) అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, కుళ్ళిపోయిన గుడ్లు, పదేపదే మరిగించి నల్లగా కందెనలా మారిన నూనెను ఉపయోగించడం చూసి అధికారులు షాకయ్యారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా సమోసాలను తయారు చేస్తున్నట్లు తేలటంతో 5 లక్షల రూపాయల విలువైన వస్తులను సీజ్ చేశారు.

సీజ్ చేసిన వస్తువుల వివరాలు:

  • పాడైపోయిన కోడిగుడ్లు: 500
  • వాడేసిన వంట నూనె: 5 కిలోలు

తయారు చేసిన పదార్థాలు:

  •  ఎగ్ సమోసాలు (350), 
  • స్వీట్ కార్న్ సమోసాలు (600), 
  • ఉల్లిపాయ సమోసాలు (1000)

ముడి పదార్థాలు: 

  • మైదా (50 కిలోలు), 
  • ఉప్పు (4 బస్తాలు), 
  • సమోసా పట్టీలు (2000), 
  • అపరిశుభ్రమైన స్వీట్ కార్న్ (10 కిలోలు)

యంత్రాలు: 

ఫ్రైయర్, ఉల్లిపాయలు కోసే యంత్రం,వంట పాత్రలు.

అన్ని వస్తువులను సీజ్ చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా  ఫుడ్ సేఫ్టీ అధికారులు  హెచ్చరించారు. ప్రజలు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కల్తీ, అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నట్లు గుర్తిస్తే ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు.