బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మరియు నిర్మాత రోహిత్ శెట్టి నివాసం వద్ద శనివారం అర్ధరాత్రి సంచలన ఘటన చోటుచేసుకుంది. ముంబై జుహు ప్రాంతంలోని ఆయన ఇంటికి ఎదురుగా గుర్తు తెలియని దుండగులు నాలుగు నుంచి ఆరు రౌండ్ల వరకు కాల్పులు జరిపి బైక్‌పై పరారైనట్టు పోలీసులు అంచనా వేసారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ కాల్పులలో ఎవరికి గాయాలు కాలేదని పోలీసులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే జుహు పోలీసులు మరియు క్రైమ్ బ్రాంచ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ముంబై పోలీస్ వర్గాలు అన్ని కోణాల నుంచి నేరస్థులను గుర్తించడానికి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ముంబై పోలీస్ ఉన్నత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేయబడింది. గుర్తు తెలియని దుండగులపై BNS మరియు ఆయుధ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.
సంఘటన తర్వాత రోహిత్ శెట్టి నివాసం చుట్టూ భారీ భద్రత మోహరించబడింది. అయితే, కాల్పులు జరిగే సమయంలో రోహిత్ శెట్టి ఇంట్లో ఉన్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రోహిత్ షెట్టి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు తీయడంలో దిట్ట. గోల్‌మాల్ కామెడీ సిరీస్‌తో మంచి గుర్తింపు పొందారు. సింగమ్, సింబా, సూర్యవంశీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, దిల్‌వాలే వంటి అనేక బ్లాక్‌బస్టర్ యాక్షన్ చిత్రాలను అందించారు. ప్రస్తుతం ఆయన గోల్ మాల్ 5 రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానుందీ మూవీ.
