వైన్ షాపుల్లో గౌడ్​లకు 25 శాతం వాటా కల్పించాలి

వైన్ షాపుల్లో గౌడ్​లకు 25 శాతం వాటా కల్పించాలి

ముషీరాబాద్/ఖైరతాబాద్, వెలుగు: వైన్ షాపుల్లో గౌడ్ లకు 25 శాతం వాటా కల్పించాలని తెలంగాణ గౌడ, కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్​గౌడ్ కోరారు. మంగళవారం చిక్కడపల్లిలోని కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ స్టేట్​ఆఫీసులో సర్వాయి పాపన్న వర్ధంతి నిర్వహించారు. పాపన్న ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. గౌడ కులస్తులను ఆదుకోవాలని, ప్రమాదవశాత్తు మృతిచెందిన కల్లుగీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియో ఇవ్వాలని డిమాండ్​చేశారు. కమిటీ కన్వీనర్ వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, గడ్డమీద విజయ్ కుమార్ గౌడ్, బాలగౌని వెంకటేశ్​గౌడ్, హర్షవర్థన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో బహుజన కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న వర్ధంతి నిర్వహించారు.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​పాల్గొని పాపన్న ఫొటోకు నివాళులర్పించారు. మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ మాట్లాడుతూ.. ఎన్నికల పేరుతో మహనీయుల వర్ధంతి, జయంతులను ప్రభుత్వం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. జాజుల శ్రీనివాస్​గౌడ్​ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్​ గౌడ్​ను రెండు పార్టీలు ఏకమై ఓడించాయన్నారు. గీత కార్పొరేషన్​మాజీ చైర్మన్ ​పల్లె రవికుమార్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేశ్​చారి, బీసీ కమిషన్​ మాజీ సభ్యుడు కె.కిశోర్​గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్​ పాల్గొన్నారు.

బషీర్ బాగ్: హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి నిర్వహించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్​గౌడ్, గౌడ కుల సంఘాల నాయకులు పాల్గొని పాపన్న ఫొటోకు పూలమాలు వేసి నివాళులర్పించారు. హిమాయత్ నగర్ లోని రాష్ట్ర గౌడ విద్యార్థి వసతి గృహంలో వసతి గృహం రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తి పాపన్న విగ్రహానికి నివాళులర్పించారు.