నాతో ఇబ్బంది అంటే చెప్పండి.. నేనెల్లిపోతా : మహేశ్వర్ రెడ్డి

నాతో ఇబ్బంది అంటే చెప్పండి.. నేనెల్లిపోతా : మహేశ్వర్ రెడ్డి

టీకాంగ్రెస్ సీనియర్ నేత,ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు  పంపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని మహేశ్వర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది హైకమాండ్. ఈ సందర్భంగా స్పందించారు మహేశ్వర్ రెడ్డి. 

"నాకు ఎందుకు షోకాజ్ ఇచ్చారో సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో ప్రచారం జరిగితే షోకాజ్ నోటీసులు ఇస్తారా. దీనిపై ఖర్గేను కలిసి తెల్చుకుంటాను. నాతో ఇబ్బంది ఉంటే చెప్పండి పార్టీ నుంచి వైదొలగడానికి సిద్దంగా ఉన్నాను.  నేను పార్టీలు మారిన వ్యక్తిని కాదు..క్రెడిబిలిటిలేని వారు నాకు నోటీసులు ఇస్తారా. నా మీద కోపం ఉంటే నాతో మాట్లాడండి..ఇలా అవమానించడం సరి కాదు. నన్ను పార్టీ నుంచి పంపే కుట్ర చేస్తున్నారు. అందుకే పొగపెట్టరు.

నాకు తెలియకుండా నా నియోజకవర్గ నేతకు ఫోన్ చేసిన చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను. నాకు షోకాజ్ ఇవ్వడం బాధాకరం ఉంది. పార్టీ వీడడంపై ఖర్గేను కలిసి నిర్ణయం తీసుకుంటాను. నేను పార్టీ మారాలంటే బాజాప్త రాజీనామ చేసి వెళతాను. నేను పార్టీ మారాలని ఏ రోజు అనుకోలేదు. నా సమావేశాలకు బీజేపీ నేత అటెండ్ అయ్యారనే ది పచ్చి అబద్దం. అమిత్ షాను.. బీజేపీ పెద్దలను కలిసేవారికి షోకాజ్ ఇచ్చే దైర్యం లేదు. కానీ నాకు ఎందుకు ఇచ్చారో అర్దం కావడం లేదు" అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా, మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా  పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయంత్రం ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసే ఛాన్స్ ఉందని సమాచారం. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు మహేశ్వర్ రెడ్డి దూరంగా ఉంటూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్న మహేశ్వర్ రెడ్డి పార్టీని వీడేందుకే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తన పాదయాత్ర ఆపాలని పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మానిక్ రావు థాక్రే చెప్పినప్పటి నుంచి మహేశ్వర్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు. ఇప్పటికే థాక్రేపై ఆయన అసమ్మతి లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఏప్రిల్ 11వ తేదీన మహేశ్వర్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి బుజ్జగించే ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేనట్లు తెలుస్తోంది.