IND VS ENG 2025: టీమిండియా కెప్టెన్ ఈజీ క్యాచ్ మిస్.. గిల్ తలకు తగిలిన బంతి

IND VS ENG 2025: టీమిండియా కెప్టెన్ ఈజీ క్యాచ్ మిస్.. గిల్ తలకు తగిలిన బంతి

ఎడ్జ్ బాస్టన్ టెస్టులో టీమిండియా కీలక క్యాచ్ మిస్ చేసి భారీ మూల్యం చెల్లిచుకుంటుంది. తొలి టెస్టులో చేసిన తప్పులనే ఎడ్జ్ బాస్టన్ లోనూ రిపీట్ చేస్తుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఎదురు దాడి చేస్తున్న సమయంలో కెప్టెన్ శుభమాన్ గిల్ ఈజీ క్యాచ్ మిస్ చేశాడు. మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 37 ఓవర్ రెండో బంతిని జడేజా బౌలింగ్ లో బ్రూక్ గట్టిగా కట్ షాట్ కొట్టాడు. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ క్యాచ్ పట్టడంలో విఫలమయ్యాడు. బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. ఆలస్యంగా క్యాచ్ కోసం చేతులు చాచడంతో బంతి గిల్ తలకు తగిలింది. 

క్యాచ్ మిస్ కావడంతో పాటు గిల్ తలకు ఏమైనా ప్రమాదం జరిగిందా అని ఫిజియో వచ్చి చెక్ చేశారు. ఎలాంటి గాయం కాకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. అయితే క్యాచ్ మిస్ చేయడం టీమిండియాకు అతి పెద్ద మైనస్ గా మారింది. వచ్చిన ఛాన్స్ వినియోగించుకొని బ్రూక్ సెంచరీ దిశగా వెళ్తున్నాడు. మరో ఎండ్ లో స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ 80 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. గిల్ మిస్ చేసిన క్యాచ్ మ్యాచ్ పై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.  

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మూడో రోజు లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసి భారత్ కు ఛాలెంజ్ విసురుతుంది. క్రీజ్ లో బ్రూక్ (91), స్మిత్ (102) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 338 పరుగులు వెనకబడి ఉంది. రెండో సెషన్ లో అటు కీలకం కానుంది. 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ జట్టును హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ ఆదుకుంటున్నారు.