
- ఇండియా ఐదో యంగెస్ట్ కెప్టెన్‌గా రికార్డు
- రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ
- ఇంగ్లండ్ టూర్‌కు టీమ్ ఎంపిక
- సుదర్శన్, అర్ష్‌దీప్‌కు చాన్స్.. కరుణ్ నాయర్ రీఎంట్రీ
- అన్‌ఫిట్ షమీ ఔట్
ముంబై: ఇండియా టెస్టు క్రికెట్‌లో కొత్త అధ్యాయం మొదలైంది. లెజెండరీ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ తప్పుకున్న తర్వాత భారీ మార్పులతో టెస్టు జట్టు సరికొత్తగా ముస్తాబైంది. రోహిత్ వారసుడిగా 25 ఏండ్ల శుభ్‌మన్ గిల్ నయా లీడర్‌గా ఎంపికయ్యాడు. రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ లభించింది. ఈ మేరకు వచ్చే నెల 20 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు 18 మందితో కూడిన జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21), సచిన్ టెండూల్కర్ (23), కపిల్ దేవ్ (24), రవిశాస్త్రి (25) తర్వాత గిల్ ఇండియా యంగెస్ట్ టెస్ట్ కెప్టెన్ కానున్నాడు. ‘ఏడాది కాలంగా కెప్టెన్సీ కోసం గిల్‌ను పరిశీలిస్తున్నాం. జట్టును సమర్థవంతంగా నడిపించే సత్తా ఈ కుర్రాడికి ఉందని మేం నమ్ముతున్నాం. ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న పని. కానీ, గిల్ అద్భుతమైన ప్లేయర్’ అని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ పేర్కొన్నాడు. ఇప్పటిదాకా 32 టెస్టులు ఆడిన గిల్ 35 సగటుతో 1893 రనస్ చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఏడు ఫిఫ్టీలు ఉన్నాయి. 27 ఏండ్ల పంత్ 43 టెస్టులు ఆడి 42.11 సగటుతో 2948 రన్స్ చేశాడు. ఆరు సెంచరీలు, 15 ఫిఫ్టీలు కొట్టాడు. జట్టులో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ లేకపోవడం ఒక్కటే ఆశ్చర్యం. షమీ ఫిట్‌గా లేకపోవడం వల్లే పక్కనబెట్టాల్సి వచ్చిందని అగార్కర్ పేర్కొన్నాడు.
సుదర్శన్, అర్ష్‌దీప్‌కు పిలుపు
డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్‌లో అదరగొడుతున్న తమిళనాడు లెఫ్టాండ్ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు ఊహించినట్టుగానే తొలిసారి టెస్టు జట్టు నుంచి పిలుపు వచ్చింది. తనతో పాటు లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా టెస్టు టీమ్‌కు ఎంపికయ్యాడు. సుదర్శన్, అర్ష్‌దీప్ ఇద్దరికీ ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉండటం ప్లప్ పాయింట్ కానుంది. డొమెస్టిక్ క్రికెట్‌లో దంచికొడుతున్న అభిమన్యు ఈశ్వరన్ బ్యాకప్ ఓపెనర్‌గా ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికయ్యాడు. గతంలోనూ తను టెస్టు జట్టులోకి వచ్చినా.. అరంగేట్రం చాన్స్ రాలేదు. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో సత్తా చాటిన నితీశ్ కుమార్ రెడ్డి తన ప్లేస్ నిలబెట్టుకున్నాడు. కానీ, తన బౌలింగ్‌పై అనుమానాలు ఉండటంతో సెలెక్టర్లు సీనియర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను 2023 డిసెంబర్ తర్వాత తిరిగి జట్టులోకి తీసుకున్నారు.
8 ఏండ్ల తర్వాత కరుణ్‌పై కరుణ
సీనియర్ క్రికెటర్ కరుణ్ నాయర్‌పై సెలెక్టర్లు ఎట్టకేలకు కరుణ చూపారు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఇండియన్ గా కరుణ్ రికార్డు సృష్టించాడు. కానీ, కొన్నాళ్లకే వేటు ఎదుర్కొన్న కరుణ్ తర్వాత డొమెస్టిక్ క్రికెట్‌లో పరుగుల మోత మోగించాడు. కోహ్లీ, రోహిత్ వైదొలగడంతో టెస్టుల్లో తన రీఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిన హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్‌ను టీమ్ నుంచి తప్పించిన సెలెక్టర్లు.. సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పరిగణనలోకి తీసుకోలేదు.
బుమ్రా కొన్ని టెస్టులకే..
కెప్టెన్సీ రేసులో జస్‌ప్రీత్ బుమ్రా కూడా ప్రధాన పోటీదారుగా ఉన్నప్పటికీ సెలెక్టర్లు గిల్‌కే ఓటు వేశారు. ఫిట్‌నెస్ సమస్యలే బుమ్రాకు ప్రతికూలంగా మారాయి. ఈ టూర్‌లో బుమ్రా ఐదు టెస్టులకూ అందుబాటులో ఉండకపోవచ్చని అగార్కర్ తెలిపాడు. ‘బుమ్రా 3–4 టెస్టులు ఆడొచ్చు. సిరీస్ ఎలా సాగుతుంది? వర్క్‌లోడ్‌ను తన బాడీ ఎలా తట్టుకుంటుంది? అనే విషయాలను చూసి నిర్ణయం తీసుకుంటాం. బుమ్రా టీమ్‌లో చాలా ముఖ్యమైన ప్లేయర్. మూడు లేదా నాలుగు టెస్టులకు ఫిట్‌గా ఉన్నా తను జట్టును గెలిపించగలడు’ అని అగార్కర్ నమ్మకం వ్యక్తం చేశాడు. కాగా, లీడ్స్‌లో జూన్20 నుంచి జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ మొదలవుతుంది.
ఇండియా టెస్టు టీమ్
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, జడేజా, ధ్రువ్ జురెల్ (కీపర్), సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.