- కోహ్లీ+రోహిత్= గిల్
- శుభ్‌మన్ బ్యాటింగ్‌లో ఆ క్వాలిటీ
- వన్డే ఫార్మాట్‌కు నయా హీరో
అది 2017.. విజయ్ హజారే ట్రోఫీ కోసం ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పంజాబ్ టీమ్‌ను రెడీ చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన సెలెక్టర్లు ఓ 17 ఏళ్ల కుర్రాడి గురించి చెబుతూ.. ‘అతనిలో చాలా టాలెంట్ ఉంది. ఈ ఏడాది చివర్లో జరిగే రంజీల్లో చాన్స్ ఇద్దాం.’ అని ప్రతిపాదించారు. టాలెంట్ ఉంటే అప్పటివరకు ఆగడం ఎందుకు. ఇప్పుడే చాన్స్ ఇద్దామన్నాడు భజ్జీ. దాంతో, సెలెక్టర్లు ఆ కుర్రాడిని టీమ్‌లోకి తీసుకున్నారు. సీన్ కట్ చేస్తే.. ఐదేళ్ల తర్వాత ఆ కుర్రాడు ఇప్పుడు టీమిండియాలో మెరుపులు మెరిపిస్తున్నాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆ టాలెంటెడ్ కుర్రాడే శుభ్‌మన్ గిల్. వరుసగా రెండు సిరీస్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచి ఈ ఫార్మాట్‌లో నయా హీరోగా మారాడు.
వెలుగు స్పోర్ట్స్ డెస్క్ : చాన్స్ దొరికిన ప్రతి ఫార్మాట్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్న శుభ్‌మన్ గిల్.. కెరీర్ స్టార్టింగ్‌లోనే తన సత్తా ఏంటో ఇండియన్ క్రికెట్‌కు చూపించాడు. 2017లో హర్భజన్ సింగ్ ఇచ్చిన ఫస్ట్ చాన్స్‌ను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న ఈ పంజాబ్ కుర్రాడు.. అస్సాంపై సెంచరీ (121)తో చెలరేగిపోయాడు. అదే ఏడాది చివర్లో ఆడిన రంజీ సెకండ్ మ్యాచ్‌లోనూ 129 రన్స్ చేయడంతో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2019లో టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. న్యూజిలాండ్‌పై అరంగేట్రం చేసినా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో 9, 7 రన్స్‌కే ఔటయ్యాడు. తర్వాత ఆసీస్‌పై 33 రన్స్ సాధించాడు. ఇదే టైమ్‌లో ఆసీస్‌పైనే టెస్ట్ డెబ్యూ కూడా చేశాడు. గత నెల వెస్టిండీస్‌తో సిరీస్‌కు సీనియర్లు లేకపోవడంతో గిల్‌కు మళ్లీ పిలుపు వచ్చింది. దీన్ని తను సద్వినియోగం చేసుకున్నాడు.
మూడు వన్డేల్లో 64, 43, 98* స్కోర్లు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. ఇప్పుడు జింబాబ్వేతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ 82*, 33, 130 స్కోర్లతో మరోసారి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ నెగ్గి వన్డే ఫార్మాట్‌కు నయా హీరోగా మారిపోయాడు. ఇప్పటివరకు ఆడిన 9 వన్డేల్లో 71.29 సగటుతో 499 రన్స్ చేశాడు. స్ట్రయిక్ రేట్ 105.27గా ఉండటం అతిపెద్ద విశేషం. ఇక 11 టెస్ట్‌ల్లో 30.47 సగటుతో 579 రన్స్ చేశాడు. అందుకే గిల్ బ్యాటింగ్‌లో కోహ్లీ, రోహిత్ క్వాలిటీ ఉందని మాజీ స్పిన్నర్ హర్భజన్ వ్యాఖ్యానించాడు. గ్రౌండ్‌లో ఎక్కడికైనా బాల్‌ను తరలించే షాట్స్ అతని సొంతమని కితాబిచ్చాడు. వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వన్డే వరల్డ్‌కప్ టీమ్‌లో గిల్‌ను చూస్తామని చాలా మంది క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. కోహ్లీతో సహా చాలా మంది సీనియర్లు అప్పటివరకు అందుబాటులో లేకపోతే గిల్ కచ్చితంగా ఫేవరెట్ ప్లేయర్‌గా మారతాడని అంటున్నారు.
భజ్జీ సలహాతోనే..
ఇక ఫ్రాంచైజీ క్రికెట్‌లో కేకేఆర్‌కు ఆడుతున్న గిల్.. గతేడాది ఫామ్ కోల్పోయాడు. ఆ టైమ్‌లో మళ్లీ హర్భజన్ చేయూత ఇవ్వడంతో గాడిలో పడ్డాడు. ‘గిల్.. మిగతా అటాకింగ్ బ్యాటర్ల మాదిరిగా బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించేవాడు. కానీ ప్రతి ఒక్కరి గేమ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని తెలుసుకోలేకపోయాడు. దీన్ని గమనించి నేను ఓ సలహా ఇచ్చా. ఓ బ్యాటర్ ఆడే రీతిలో బ్యాటింగ్ చేయమని చెప్పా. పేసర్ల బౌలింగ్‌లో సింగిల్స్‌తో పాటు చాన్స్ ఉన్నప్పుడే బౌండ్రీలు కొట్టాలని సూచించా. దీనిని బాగా వర్కౌట్ చేసిన గిల్ యూఏఈలో సక్సెస్ అయ్యాడు. గిల్‌లో ఓ మంచి లక్షణం ఉంది. రన్స్ చేయడంలో విఫలమైనప్పుడు అవమానంగా భావిస్తాడు. తన వల్ల టీమ్ ఫెయిల్ అవుతుందేమోనని భయపడతాడు. ఇదే క్యారెక్టర్ సచిన్‌లోనూ ఉండేది’ అని భజ్జీ వివరించాడు. గిల్ వయసు 22 ఏండ్లే. తనకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇదే జోరు కొనసాగిస్తే జట్టులో కీలకం అవుతాడు.
