V6 News

అన్నా.. అని పిలిచినందుకు బార్బర్ పై ఎస్సై దాడి

అన్నా.. అని పిలిచినందుకు బార్బర్ పై ఎస్సై దాడి
  • కరీంనగర్  త్రీ టౌన్  పరిధిలో ఘటన 
  • బాధితుడి ఫిర్యాదుతో ఎస్సైపై సస్పెన్షన్  వేటు వేసిన సీపీ గౌస్​  ఆలం

కరీంనగర్, వెలుగు: అన్నా అని పిలిచినందుకు సెలూన్  షాపు నిర్వాహకుడిపై ఎస్సై దాడి చేశాడు. కరీంనగర్ లోని ఖాన్‌‌పురా ప్రాంతంలోని న్యూ ప్రజా హెయిర్  స్టైల్  సెలూన్ ‌‌కు ఉదయం 7.30 గంటల సమయంలో త్రీటౌన్  ఎస్సై చైతన్య చందర్  వెళ్లారు. ఆ సమయంలో షాప్ ను క్లీన్  చేస్తున్న సెలూన్  షాపు నిర్వాహకుడు పగడాల రాము ఎస్సైని చూసి మర్యాదపూర్వకంగా అన్నా కూర్చో అని పిలిచాడు. దీంతో సదరు ఎస్సై ఆగ్రహంతో ఊగిపోతూ నన్ను అన్నా అని పిలుస్తావా? అంటూ అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అతడిపై చేయిచేసుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ సెలూన్‌‌లోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో బాధితుడు ఎస్సై దురుసు ప్రవర్తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు తెలిసిన వాళ్లకు సీసీ కెమెరా పుటేజీ పంపడంతో సోషల్  మీడియాలో వైరల్  అయింది.

దీంతో జరిగిన ఘటనపై సీపీ గౌష్  ఆలం విచారణకు ఆదేశించారు. ఎస్సై చైతన్య చందర్  ఆర్టీసీ బస్టాండ్  వద్ద బందోబస్త్  డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. సామాన్య పౌరుడిపై దాడి చేయడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడం, విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలడంతో కరీంనగర్  సీపీ గౌస్  ఆలం సిఫారసు మేరకు ఉన్నతాధికారులు సదరు ఎస్సైని సస్పెండ్  చేశారు. పోలీస్  శాఖ క్రమశిక్షణకు మారుపేరని, సామాన్య ప్రజలతో దురుసుగా ప్రవర్తించినా, చట్టాన్ని అతిక్రమించి అధికారాన్ని దుర్వినియోగం చేసినా సహించేది లేదని సీపీ హెచ్చరించారు.