ఏజెన్సీపై సికిల్ సెల్ పంజా.. రాష్ట్ర వ్యాప్తంగా11 లక్షల మందికి పరీక్షలు

ఏజెన్సీపై సికిల్ సెల్ పంజా.. రాష్ట్ర వ్యాప్తంగా11 లక్షల మందికి పరీక్షలు
  •     గిరిజన గూడేల్లో పడగ విప్పుతున్న జన్యు రోగం
  •     భద్రాద్రి, ఆదిలాబాద్, మంచిర్యాల తదితర ఏజెన్సీ జిల్లాల్లో కేసులు
  •     7 వేల మంది క్యారియర్స్, 556 మందికి వ్యాధి నిర్ధారణ 

హైదరాబాద్, వెలుగు: అడవి బిడ్డలను సికిల్ సెల్ వ్యాధి వణికిస్తున్నది. ఏజెన్సీ గూడేల్లో  పంజా విసురుతున్నది. రక్తంలోనే దాగున్న ఈ జన్యుపరమైన ముప్పు.. సర్కారు చేపట్టిన మెగా స్క్రీనింగ్‌‌తో బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా11 లక్షల మందికి స్ర్కీనింగ్ టెస్టులు చేస్తే.. 7,300 మందికిపైగా క్యారియర్లు, 550 మందికిపైగా బాధితులు బయటపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్  ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే విస్తరిస్తున్న ఈ వ్యాధి.. బాధితుల ఎర్ర రక్త కణాలను కొడవలిలా మార్చేసి నరకం చూపిస్తున్నది. 

ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం రూ. 43 కోట్లతో నివారణ చర్యలు చేపట్టింది. నిమ్స్‌‌లో స్పెషల్ వార్డులు ఏర్పాటు చేసి, ఉచిత మందులు పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నది. అయితే, ఇది వంశపారంపర్యంగా వచ్చే రోగం కావడంతో మేనరికపు పెళ్లిళ్లతోనే అసలు ముప్పు పొంచి ఉందని, పెళ్లికి ముందే రక్త పరీక్షలు చేసుకోవడం తప్పనిసరి అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

ఏజెన్సీ జిల్లాల్లోనే ఎక్కువ 

సికిల్ సెల్ వ్యాధి ప్రభావం ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో 2,776 మంది క్యారియర్స్, 186 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 1,296 మంది క్యారియర్స్, 67 మంది వ్యాధిగ్రస్తులు, మంచిర్యాల జిల్లాలో1,263 మంది క్యారియర్స్, 172 మంది బాధితులు, ఆసిఫాబాద్ జిల్లాలో 999 మంది క్యారియర్స్, 32 మంది బాధితులు, ఖమ్మం జిల్లాలో 425 క్యారియర్స్ ఉన్నారు. 

ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోనూ క్యారియర్స్, వ్యాధిగ్రస్తులను గుర్తించారు.  హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మెదక్‌‌లాంటి అర్బన్ జిల్లాల్లో సికిల్ సెల్ కేసులు నామమాత్రంగానే నమోదయ్యాయి.   గిరిజనులు తరతరాలుగా వాళ్ల తెగల్లోనే పెండ్లిళ్లు చేసుకోవడం వల్ల ఈ జన్యు పరమైన సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. 

పెళ్లికి ముందే టెస్టులు తప్పనిసరి 

సికిల్ సెల్ డిసీజ్ వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన సమస్య కాబట్టి.. పెళ్లికి ముందే వధూవరులిద్దరూ హెచ్పీఎల్సీ, సిక్లింగ్ రక్త పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి మాత్రమే క్యారియర్ లక్షణాలుంటే పర్వాలేదని, కానీ.. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ క్యారియర్లు అయితే మాత్రం పెళ్లి చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.  ఇద్దరు క్యారియర్లు పెళ్లి చేసుకుంటే పుట్టబోయే బిడ్డకు తీవ్రమైన అనారోగ్యం వచ్చే అవకాశం 25 శాతం ఉంటుంది.

ముఖ్యంగా మేనరికం పెళ్లిళ్లు చేసుకునేవారిలో ఈ ముప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి వారు కచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ ఇప్పటికే పెళ్లయి ఉంటే.. గర్భం దాల్చిన12 వారాల్లోపే ప్రభుత్వ హాస్పిటల్‌‌కు వెళ్లి స్క్రీనింగ్ చేయించుకోవాలని  సూచిస్తున్నారు.  టీ డయాగ్నస్టిక్ హబ్స్ లో ఈ టెస్టులు ఫ్రీగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 

రూ. 43 కోట్లతో నివారణ చర్యలు 

సికిల్ సెల్ మహమ్మారిని నివారించేందుకు ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ సహకారంతో చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ ఏడాది స్క్రీనింగ్, మందులు, చికిత్స కోసం రూ. 43 కోట్లు కేటాయించింది. నివారణ చర్యల్లో భాగంగా 33 జిల్లాల్లోనూ అత్యాధునికమైన హెచ్పీఎల్సీ మిషన్లతో గర్భిణీలకు, బడి పిల్లలకు, ఏజెన్సీ ఏరియాల ప్రజలకు టెస్టులు చేస్తున్నది. ఎవరికైనా వ్యాధి ఉన్నట్లు తేలితే భయపడాల్సిన పనిలేదు. వాళ్ల కోసం జిల్లాల్లోనే డే కేర్ సెంటర్లు పెట్టి రక్తం ఎక్కిస్తున్నారు. అలాగే హైడ్రాక్సీ యూరియా టాబ్లెట్లను ఫ్రీగా అందిస్తున్నారు. 

ఇక సీరియస్ కేసుల కోసం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో సెంటర్ ఆఫ్ కాంపీటెన్స్ పేరుతో స్పెషల్ వార్డును ప్రభుత్వం ఓపెన్ చేసింది. మొత్తం 20 బెడ్లు, 5 ఐసీయూలు కేటాయించి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నది. బాధితులకు సదరం ద్వారా సర్టిఫికెట్లు ఇప్పించి కూడా ఆదుకుంటున్నది. 2047 నాటికి ఈ సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.  

రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారి..   

సికిల్ సెల్ డిసీజ్ అనేది అంటువ్యాధి కాదు. ఇది తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చే ఓ జన్యుపరమైన సమస్య. మన రక్తంలో ఎర్ర రక్త కణాలు గుండ్రంగా, మెత్తగా ఉంటేనే రక్తనాళాల్లో సాఫీగా ప్రయాణిస్తాయి. కానీ జన్యువుల్లో తేడా వల్ల, ఆక్సిజన్ తగ్గినప్పుడు ఈ కణాలు గట్టిపడిపోయి కొడవలి (సికిల్) ఆకారంలోకి వంకర తిరుగుతాయి. ఇలా మారిన కణాలు రక్తనాళాల్లో ప్రయాణించలేక, ఎక్కడికక్కడ ఇరుక్కుపోవడంతో రక్త ప్రవాహానికి అడ్డుపడతాయి. దీనివల్ల బాధితులు ఎప్పుడూ నీరసంగా, తీవ్రమైన రక్తహీనత(ఎనీమియా)తో పాలిపోయి కనిపిస్తారు. 

ముఖ్యంగా ఎముకలు, కీళ్లలో భరించలేనంత నొప్పి వస్తుంది. చిన్న పిల్లల్లో అయితే చేతులు, కాళ్లు వాచిపోవడం, కళ్లు పచ్చగా మారి కామెర్లు రావడం, రోగనిరోధక శక్తి తగ్గి తరచుగా జలుబు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంది. పరిస్థితి ముదిరితే ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడం, పిల్లలకు పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.