
- శంషాబాద్ పరిధి నేషనల్ హైవేపై సిద్ధాంతి బస్తీ వాసుల ఆందోళన
- ఫ్లై ఓవర్‌ను విస్తరించకపోవడంతో ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారని ఆవేదన
- ఇటీవల యాక్సిడెంట్లో గాయపడి మృతి చెందిన యాదయ్య డెడ్‌బాడీతో రోడ్డుపై బైఠాయింపు
- ధర్నాతో హైవేపై ట్రాఫిక్ జామ్.. గంట పాటు నిలిచిన వెహికల్స్
శంషాబాద్, వెలుగు : హైదరాబాద్– బెంగళూర్ నేషనల్ హైవేపై కిషన్ గూడ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌ను విస్తరించకపోవడంతో రోడ్డు ప్రమాదాల బారిన పడి ఊరి జనం చనిపోతున్నారంటూ సిద్ధాంతి బస్తీ గ్రామస్తులు శనివారం ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సిద్ధాంతి బస్తీకి చెందిన యాదయ్య(65)ను మూడ్రోజుల కిందట హైవేపై రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడ్డ యాదయ్య హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ శనివారం చనిపోయాడు. దీంతో యాదయ్య డెడ్‌బాడీతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు నేషనల్ హైవేపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. హైదరాబాద్– బెంగళూరు నేషనల్ హైవేపై శంషాబాద్ పరిధిలోని సింప్లెక్స్ ఏరియా నుంచి కిషన్ గూడ వరకు ఫ్లై ఓవర్ నిర్మాణానికి మొదట పనులను చేపట్టారన్నారు.
అయితే, ఈ ఫ్లై ఓవర్ ర్యాంప్‌ను సింప్లెక్స్ దగ్గర కాకుండా కి.మీ దూరంలోని సిద్ధాంతి బస్తీ వద్ద నిర్మించారన్నారు. దీని కారణంగా తమ గ్రామానికి వెళ్లాలంటే హైవేపై రోడ్డ్ దాటాల్సి వస్తోందని సిద్ధాంతి బస్తీ వాసులు తెలిపారు. రోడ్డు దాటే క్రమంలో స్పీడ్ గా వచ్చే వెహికల్స్ ఢీకొని 6 నెలల్లో ఆరుగురు చనిపోయారన్నారు. ఇప్పటికైనా ఫ్లై ఓవర్ ను సిద్ధాంతి బస్తీ నుంచి సింప్లెక్స్ ఏరియా వరకు పొడిగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ధర్నా కారణంగా హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. గంట పాటు ఎయిర్ పోర్టుకు వెళ్లే వెహికల్స్ నిలిచిపోయాయి. ఏసీపీ రామచంద్రరావు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సోమవారం నేషనల్ హైవే అథారిటీ అధికారులను పిలిపించి సమస్య పరిష్కారమయ్యే విధంగా చూస్తానని తెలిపారు. దీంతో సిద్ధాంతి బస్తీ వాసులు ఆందోళన విరమించారు.