కాలుష్య కోరల్లోకి మా గ్రామాలని లాగొద్దు.... సిద్ధాపూర్ గ్రామస్తుల ఆందోళన

కాలుష్య కోరల్లోకి మా గ్రామాలని లాగొద్దు.... సిద్ధాపూర్ గ్రామస్తుల ఆందోళన

చెత్త రీసైక్లింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు కొత్తూరు మండలంలోని గ్రామాల ప్రజలు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ లో TGIICకి కేటాయించిన భూముల్లో ఎకో టౌన్ చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  కొత్తూరు మండలంలోని సిద్దాపూర్,వేముల నర్వ, కోడిచర్ల, వైఎం తాండా, కొడిచర్ల తాండాల ప్రజలు తమ గ్రామాల్లో నిరసన సభలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. 

ఈ ప్రాజెక్టు వల్ల చుట్టూ ఉన్న గ్రామాలు కాలుష్యమయమై తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని, ప్రజలతోపాటు పంటలు, భూములు పశుపక్షాదులు సైతం  తీవ్రప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని, గ్రామాల్లోని ప్రజలు గ్రామాలను విడిచి వేరే గ్రామాలకు వెళ్లే పరిస్థితి దాపురిల్లుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. 

సుమారు 8 గ్రామాల్లోని ప్రజలకు ఆటంకం కల్పించే కలుషితమైన ఈ ప్రాజెక్టు తమకొద్దంటూ ఆందోళనలు చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, గ్రామ సభలు నిర్వహించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గ్రామ సభల్లో తీర్మానం చేసి ప్రభుత్వ దృష్టికి  తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే గ్రామస్తులు ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నారు.