ఎవరిని కదిలించినా కన్నీళ్లే.. సిగాచి కంపెనీ దగ్గర కుటుంబసభ్యుల ఎదురుచూపులు

ఎవరిని కదిలించినా కన్నీళ్లే.. సిగాచి కంపెనీ దగ్గర కుటుంబసభ్యుల ఎదురుచూపులు
  • తమ వారి క్షేమ సమాచారం కోసం కనిపించిన వారినల్లా ఆరా తీస్తున్న ఆత్మీయులు
  • ఆసుపత్రుల్లో చావుబతుకుల్లో ఉన్నవారి కోసం పడిగాపులు
  • ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ..

సంగారెడ్డి/రామచంద్రాపురం, వెలుగు: భర్త కోసం భార్య, కొడుకు కోసం తల్లి, తండ్రి కోసం బిడ్డలు.. మూడు రోజులుగా సిగాచి పరిశ్రమ పరిసరాల్లో కనిపిస్తున్న దయనీయ దృశ్యాలివి. తమ వారి జాడ కానరాక, అసలు బతికి ఉన్నారో లేదో తెలియక , చేతిలో ఫొటోలు పట్టుకొని  కనిపించిన వారినల్లా ఆరా తీస్తూ కన్నీరుమున్నీరవుతున్నారు. మరికొందరు చావుబతుకుల్లో చికిత్స పొందుతున్న తమవారి కోసం హాస్పిటల్స్​ దగ్గర పడిగాపులు పడ్తున్నారు.  పాశమైలారం వద్ద గల సిగాచి కంపెనీలో మూడు రోజుల కింద జరిగిన పేలుడులో 40 మంది వరకు చనిపోగా.. మరో 40 మందికి పైగా కనిపించకుండా పోయారు.

సహాయ చర్యలు కొనసాగుతుండగా, శిథిలాల నుంచి  మాంసపు ముద్దల్లా మారిన మృతదేహాలను బయటకు తీయడం కష్టసాధ్యమవుతోంది. తీరా ఆయా డెడ్​బాడీలను రక్తసంబంధీకుల డీఎన్ఏ ఆధారంగా గుర్తించి,  కుటుంబసభ్యులకు అప్పగించేందుకు  టైం పడుతోంది. ఈ క్రమంలో ఆచూకీ దొరకకుండా పోయిన వారి కోసం వారి కుటుంబ సభ్యులు కంపెనీ వద్ద గల పునరావాస కేంద్రంలో కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.  శిథిలాల కింద చిక్కుకుపోయిన తమ వారిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని కనబడిన వారినల్లా ప్రాధేయపడుతున్నారు.

కంట్రోల్ రూమ్  కు 56 కాల్స్..

సంగారెడ్డి టౌన్:  సిగాచి ఇండస్ట్రీ ప్రమాద బాధితులు, వారి కుటుంబీల సాయం  కోసం  సంగారెడ్డి కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ కు ఫోన్​కాల్స్​ వెల్లువెత్తుతున్నాయి.  ప్రమాద బాధిత వివరాలు తెలుసుకునేందుకు ఇప్పటి వరకు 56 ఫోన్​కాల్స్​ వచ్చాయని డీఆర్వో పద్మజారాణి తెలిపారు. వాటికి స్పందించి క్షతగాత్రుల వివరాలను సంబంధీకులకు అందించామన్నారు. ఎలాంటి సమాచారం కావాలన్నా 08455- 276155 లో  సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

నవంబర్‌‌లో పెండ్లి అంతలోనే.. 

యూపీకి చెందిన జితేందర్‌‌ సరోజ్‌‌ (25) నాలుగేండ్లుగా సిగాచిలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. జితేందర్‌‌కు నవంబర్‌‌లో పెండ్లి జరగాల్సి ఉంది. అంతలోనే కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ప్రస్తుతం వెంటిలేటర్‌‌పై ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్నాడు. ఇతడి పరిస్థితి చాలా క్రిటికల్‌‌ ఉందని డాక్టర్లు చెబుతుండడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

80 శాతం గాయాలతో.. 

బిహార్‌‌  రాష్ట్రంలోని కైమూర్‌‌  ప్రాంతానికి చెందిన విదేసీ ఖహర్  సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 80 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఐసీయూసీలో ట్రీట్‌‌మెంట్‌‌  తీసుకుంటున్నాడు. ఐదేండ్ల కింద కంపెనీలో చేరిన ఇతడు ప్రస్తుతం పటాన్‌‌ చెరులో నివాసం ఉంటున్నాడు. నైట్‌‌డ్యూటీకి వెళ్లిన ఖహర్‌‌ ఇంకో గంట అయితే డ్యూటీ దిగిపోతాడనగా ప్రమాదం జరగడంతో తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌‌లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

భర్త కోసం..

బిహార్‌‌కు చెందిన శివాజీకుమార్‌‌ (30) రెండేండ్ల కింద హైదరాబాద్‌‌  వచ్చాడు. సిగాచి కంపెనీలో పని చేస్తూ మూడు రోజుల కింద జరిగిన ప్రమాదం తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో అతడి భార్య అనీతాదేవి మూడు రోజులుగా శివాజీ కోసం వెతుకుతోంది. తన భర్త ఆచూకీ చెప్పాలని, తన భర్తను తీసుకురావాలని కనబడిన ప్రతి ఒక్కరినీ వేడుకుంటోంది. తండ్రి కోసం  పసి పిల్లాడు సైతం మూడు రోజులుగా ఇక్కడే ఉంటున్నాడు. 

చేరిన రెండు రోజులకే.. 

మహారాష్ట్రకు చెందిన భీంరావ్‌‌  ఇటీవలే సిగాచి కంపెనీలో చేరాడు. అతడు చేరిన రెండు రోజులకే ప్రమాదం జరిగింది. 80 శాతం కాలిన గాయాలతో ధ్రువ హాస్పిటల్‌‌  ఐసీయూలో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్నాడు. ఇతడు బతికే అవకాశం చాలా తక్కువ అని డాక్టర్లు చెబుతుండడంతో అతడి భార్య సోనీ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. బిడ్డను ఎలా పోషించాలని, తాను ఎలా బతకాలంటూ రోదిస్తోంది. 

 తండ్రి కోసం.. 

బిహార్‌‌కు చెందిన మున్‌‌మున్‌‌ చౌదరి (48) పటాన్‌‌చెరు హాస్పిటల్‌‌లో వెంటిలేటర్‌‌పై ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్నాడు. తొమ్మిదేండ్లుగా సిగాచిలో పని చేస్తున్న ఆయన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడి కోసం కొడుకు సోనూ చౌదరి మూడు రోజులుగా ఆసుపత్రిలో కూర్చున్న చోటు నుంచి లేవకుండా ఎదురుచూస్తున్నాడు. మున్‌‌ మున్‌‌  చౌదరి బతికే అవకాశం 10 శాతం మాత్రమే ఉందని డాక్టర్లు చెబుతుండడంతో దేవుడిపై భారం వేసి అక్కడే వేచి చూస్తున్నాడు.