V6 News

90 రోజుల్లో రూ.2 లక్షలు తగ్గిన కిలో వెండి.. ఇప్పుడు కొనొచ్చా? ఆగితే బెటరా?

90 రోజుల్లో రూ.2 లక్షలు తగ్గిన కిలో వెండి.. ఇప్పుడు కొనొచ్చా? ఆగితే బెటరా?

వెండి కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. గత కొన్ని నెలలుగా ఆకాశమే హద్దుగా విహరించిన వెండి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే వెండి ధర ఏకంగా 45 శాతం పతనమై ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. కిలో వెండిపై రేటు రూ.లక్షా 87వేల వరకు తగ్గడం మార్కెట్ చరిత్రలో ఒక భారీ కుదుపుగా నిలిచింది.

ఈ ఏడాది జనవరి 29న కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.4లక్ష 39వేల 331కి చేరింది. అయితే ప్రస్తుతం రూ.2లక్షల 50వేల వద్ద తచ్చాడుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ విలువ పెరగడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై సందిగ్ధత వెండి ధరలను తగ్గించేశాయి. ఏప్రిల్ నెలలోనే ధరల్లో రూ. 25వేల వరకు హెచ్చుతగ్గులు కనిపించాయంటే మార్కెట్ ఎంత ఓలటైల్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరి ఇప్పుడు వెండి కొనడం మంచిదేనా?
సిల్వర్ ప్రస్తుతం ఒక కరెక్షన్ దశలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినప్పుడు వెండి తన సేఫ్ హెవెన్ హోదాను కోల్పోయి ధరలు తగ్గుతాయి. దీర్ఘకాలికంగా చూస్తే వెండికి మంచి భవిష్యత్తు ఉందని నిపుణులు చెబుతున్నారు. 2026 నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ఒక ఔన్సు ధర 85 నుంచి 100 డాలర్ల వరకు చేరుకోవచ్చని అంచనా.

ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే.. ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది కాబట్టి మరికొంత కాలం వేచి చూడటం మంచిది అంటున్నారు నిపుణులు. వెండి ధర కిలో రూ.2లక్ష 25వేల స్థాయిని తాకే అవకాశం ఉందని అగ్‌మాంట్ బులియన్ నివేదిక చెబుతోంది. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫిజికల్ సిల్వర్ తో పాటు సిల్వర్ ఈటీఎఫ్‌లు, సిల్వర్ ఎస్‌ఐపీలు వంటి ఆధునిక పెట్టుబడి మార్గాలను ఎంచుకోవచ్చని చెబుతున్నారు.

వెండి ధరలు ప్రస్తుతం అస్థిరంగా ఉన్నాయి. పారిశ్రామికంగా సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలకు వెండికి డిమాండ్ పెరుగుతున్నందున, ధరలు కనిష్ట స్థాయికి చేరినప్పుడు 'స్మార్ట్ ఇన్వెస్టర్లు' కొనుగోళ్లు ప్రారంభించడం మంచిది. ప్రస్తుతానికి మాత్రం ఆచి తూచి అడుగు వేయడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.