మళ్లీ రేసు మొదలైందా : ఒకే సారి 5 వేల రూపాయలు పెరిగిన కిలో వెండి

మళ్లీ రేసు మొదలైందా : ఒకే సారి 5 వేల రూపాయలు పెరిగిన కిలో వెండి

నెల రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధర.. మళ్లీ పెరగటం మొదలైంది. 2026, మే 2వ తేదీ కిలో వెండి ఒకేసారి 5 వేల రూపాయలు పెరిగింది. నిన్నటికి నిన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 993 రూపాయలు పెరగటం.. మరికొన్ని రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న వార్తలు వచ్చిన క్రమంలో.. పెట్టుబడిదారులు అందరూ ఇప్పుడు బంగారం, వెండి వైపు మళ్లుతున్నారు. ఈ క్రమంలోనే వెండి ధరల్లో అనూహ్యమైన మార్పు కనిపించింది. ఒక్క రోజులోనే కిలో వెండి 5 వేల రూపాయలు జంప్ అయ్యింది. ఇదే విధంగా పెరుగుతూ ఉంటుందా లేక.. తగ్గుతుందా అనే ఇప్పటికిప్పుడు అంచనా వేయలేకపోతున్నారు వ్యాపారులు.

సాధారణంగా బంగారం పరుగులు పెడుతుంటే వెండి నడక సాగిస్తుంటుంది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. బంగారం కంటే వేగంగా వెండి బుల్లెట్ రైలు మాదిరిగా దూసుకెళ్తోంది. కేవలం ఒక్క శనివారం రోజే ఏకంగా రూ.5వేలు పెరిగిందంటే మార్కెట్ ఏ రేంజ్‌లో హీటెక్కిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర ఇవాళ 10వేలు పెరిగిన తర్వాత రూ.2లక్షల 70వేల మార్కును తాకి, సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంది.

ఈ అనూహ్య పెరుగుదల వెనుక ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో యుద్ధం ముదురుతుండటం, గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనడం ఇన్వెస్టర్లను వెండి వైపు మళ్లిస్తోంది. స్టాక్ మార్కెట్లలో రిస్క్ తీసుకోవడం కంటే.. సేఫ్ హెవెన్ గా భావించే వెండి, బంగారంపై పెట్టుబడి పెట్టడమే బెస్ట్ అని పెద్ద పెద్ద సంస్థలు భావిస్తున్నాయి. దీనికి తోడు పారిశ్రామికంగా వెండికి ఉన్న డిమాండ్ రేసును మరింత తీవ్రతరం చేస్తోంది.

మున్ముందు ఎలా ఉండబోతోంది?
ఈ రేస్ ఇప్పట్లో ఆగేలా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో వెండి ధర కేజీకి 3 లక్షల రూపాయల మైలురాయిని చేరుకున్నా ఆశ్చర్య పోనక్కర్లేదంటున్నారు. వెండిని కేవలం ఆభరణంగానే కాకుండా.. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలోనూ విరివిగా వాడుతుండటంతో డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంటుంది.

మొత్తానికి వెండి కొందామనుకునే వారికి ఇది షాకింగ్ న్యూస్ అయినప్పటికీ.. ఇప్పటికే కొని పెట్టుకున్న ఇన్వెస్టర్లకు మాత్రం పండగే అని చెప్పాలి. వెండి రేటు పెరుగుదల ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో ఇది 'సామాన్యుడి బంగారం' అన్న ట్యాగ్‌ను కోల్పోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.