
నింగ్బో (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేయగా.. మెన్స్ స్టార్లు లక్ష్యసేన్, హెచ్.ఎస్. ప్రణయ్ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టారు. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో 17వ ర్యాంకర్ సింధు 21–15, 21–19తో 36వ ర్యాంకర్ ఏస్తర్ నురుమి (ఇండోనేసియా)పై వరుస గేమ్స్‌లో గెలిచి ప్రిక్వార్టర్స్ చేరింది. మెన్స్ సింగిల్స్‌లో యంగ్‌స్టర్స్ కిరణ్ జార్జ్, ప్రియాంశు రజావత్ కూడా ముందంజ వేశారు.
జార్జ్ 21-–-16, 21--–8 తేడాతో దిమిత్రి పనారిన్ (కజకిస్తాన్)ను 35 నిమిషాల్లో ఓడించగా.. రజావత్ తొలి గేమ్ కోల్పోయినప్పటికీ పుంజుకొని 20-–22, 21-–12, 21–-10 తేడాతో థాయ్‌లాండ్ షట్లర్ కాంతఫోన్ వాంగ్చరోన్పై అద్భుత విజయం సాధించాడు. కానీ, లక్ష్యసేన్ 18–21, 10–21తో లీ చియా హో (చైనీస్ తైపీ) చేతిలో వరుసగా గేమ్స్‌లో పరాజయం పాలవగా.. ప్రణయ్ 16–-21, 21–-12, 11–-21 తేడాతో చైనా షట్లర్ జూ గ్వాంగ్లు చేతిలో పోరాడి ఓడిపోయాడు.
డబుల్స్‌లో హరిహరన్– -రూబన్ కుమార్ జోడీ 21–-3, 21–-12తో మధుక– లహిరు వీరసింఘే (శ్రీలంక) జంటపై విజయం సాధించగా.. పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ – సాయి ప్రతీక్ జంట 19-–21, 12–-21తో చియూ సియాంగ్ – వాంగ్ చి -లిన్ ( చైనీస్ తైపీ) చేతిలో తేడాతో ఓడింది. విమెన్స్ సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు.
ఆకర్షి 13–-21, 7-–21 తేడాతో మూడో ర్యాంకర్ హాన్ యూ (చైనా) చేతిలో చిత్తవగా, అనుపమ 13–-21, 14-–21 తేడాతో 13వ ర్యాంకర్ రచనోక్ ఇంటనోన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. విమెన్స్ డబుల్స్‌లో ప్రియ– శృతి మిశ్రా జంట 11–-21, 13–-21 తేడాతో చైనీస్ తైపీకి యున్ సాంగ్– చియన్ హుయ్ యు జంట చేతిలో ఓడింది.