గోదావరిఖని, వెలుగు: సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీలో ఆర్జీ–1 ఏరియా బ్రాంచ్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆరెల్లి పోషం బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. యూనియన్ నాయకత్వం ఒంటెత్తు పోకడలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో టీబీజీకేఎస్ యూనియన్‌లో ఏరియా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న తాను తర్వాత ఏఐటీయూసీలో చేరగా మొదట కన్వీనర్ పదవి ఇచ్చారని, అనంతరం బ్రాంచ్ సెక్రటరీగా ఎన్నుకున్నారని చెప్పారు. అయితే ఆ పదవిలో ఉన్నప్పటికీ తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, లెటర్ ప్యాడ్ వాడుకునే అవకాశం కూడా కల్పించలేదని ఆరోపించారు.
కార్మికుల సమస్యలను గనుల వద్దకు లేదా జీఎం కార్యాలయంలోని విభాగాల వద్దకు తీసుకెళ్లి పరిష్కరించాలని ప్రయత్నిస్తే ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య తనను అడ్డుకున్నారని పేర్కొన్నారు. యూనియన్ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లేదని, లక్షల రూపాయల సభ్యత్వ ఫీజులు, భాస్కర్‌రావు భవన్ అద్దెలు, విరాళాల విషయంలో ఆడిటింగ్ జరగకపోయినా అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య వారినే సమర్థించడం బాధ కలిగించిందన్నారు. ఈ నేపథ్యంలో యూనియన్‌లో కొనసాగడం సాధ్యం కాదని భావించి ఏఐటీయూసీకి రాజీనామా చేస్తున్నట్లు ఆరెల్లి పోషం తెలిపారు.
