హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి పెంచడంతో పాటు సరఫరాను నిరంతరాయం కొనసాగించేందుకు సింగరేణి సంస్థ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఏరియాల వారీగా స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ శనివారం సింగరేణి సీఎండీ డా. బుద్దప్రకాష్ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే మూడు నెలల పాటు ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, గ్రేడ్ పరిరక్షణ, డిస్పాచ్, ఉత్పాదకత, పనితీరు మెరుగుదల, ఏరియాలు–కార్పొరేట్ విభాగాల మధ్య సమన్వయం, కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని సీఎండీ ఆదేశించారు.
అధికారులు వీరే..
రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి చేసే ఏరియాల వారీగా పలువురు డైరెక్టర్లను స్పెషలాఫీసర్లుగా నియమిస్తూ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యనారాయణను సత్తుపల్లి, ఇల్లందు ఏరియాలు.. ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లకు మణుగూరు, భూపాలపల్లి ఏరియాలు.. ఫైనాన్స్ డైరెక్టర్ గౌతమ్ పొట్రూకు బెల్లంపల్లి, మందమర్రి ఏరియాలు.. ఈ అండ్ఎం డైరెక్టర్ ఎం.తిరుమల రావుకు గోదావరిఖని ఆర్జీ-1, ఆర్జీ-3 ఏరియాలు.. కోల్ మూవ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వెంకన్నకు గోదావరి ఖని ఆర్జీ-2, నైనీ ఏరియాలు.. మార్కెటింగ్ సీఎం అండ్ఈడీ టి.శ్రీనివాస్ ను శ్రీరాంపూర్, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు.
వీరు అన్ని ఓపెన్‌కాస్ట్ గనులు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో తగిన సంఖ్యలో క్రషర్లు ఏర్పాటు చేసి, అవి ఎప్పటికప్పుడు సక్రమంగా పనిచేసేలా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో రోజువారీ, గ్రేడ్‌వారీ బొగ్గు డిస్పాచ్ ప్రణాళికను ముందుగానే రూపొందించి కచ్చితంగా అమలు చేయాలి. ఉత్పత్తి నుంచి డిస్పాచ్ వరకు ప్రతి దశలో నాణ్యత నియంత్రణకు స్పెషల్ ఆఫీసర్లు వ్యక్తిగత బాధ్యతతో వ్యవహరించాలని సీఎండీ సూచించారు.
