భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కోల్ ఇండియా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సింగరేణి క్రీడాకారులు సత్తా చాటారు. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ధన్బాద్లో ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు కోల్ ఇండియా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. సింగరేణి క్రీడాకారులు రెండు గోల్డ్ మెడల్స్ సాధించి ప్రతిభను చాటారు.
వెటరన్ 45ప్లస్ పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీరాంపూర్ ఏరియాలో డీజీఎంగా పనిచేస్తున్న ఏబీ హరినారాయణ, డబుల్స్ విభాగంలో హరినారాయణ, భూపాలపల్లి ఏరియాకు చెందిన జనరల్ అసిస్టెంట్ పోగుల శంకరయ్య జంటగా ఆడిఫైనల్లో గోల్డ్ మెడల్స్ సాధించారు. ప్రతిభ చాటిన క్రీడాకారులకు భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ కుమార్ అగర్వాల్ మెడల్స్ అందజేశారు. క్రీడాకారులను జీఎం వెల్ఫేర్ జీవీ కిరణ్ కుమార్, డీజీఎం పర్సనల్ కేసా నారాయణ అభినందించారు.
