సింగరేణిని ముంచింది బీఆర్ఎస్సే.. బొగ్గుపై హరీశ్వి దొంగ మాటలు: కూనంనేని

సింగరేణిని ముంచింది బీఆర్ఎస్సే.. బొగ్గుపై హరీశ్వి దొంగ మాటలు: కూనంనేని
  • సింగరేణిలో బొగ్గు దొంగతనం జరగలేదు
  • అవి మేనేజ్​మెంట్​ తప్పుడు లెక్కలు
  • మీ యూనియన్​ కోసం సింగరేణి 
  • ప్రతిష్టను దిగజారుస్తారా? అంటూ కామెంట్

హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థను ముంచింది బీఆర్ఎస్సే అని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సింగరేణి సంస్థలో గనులు, కార్మికుల సంఖ్య తగ్గిపోవడానికి ముఖ్య కారణం గత బీఆర్ఎస్​ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్ శుక్రవారం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, కార్యదర్శి కె.రాజ్ తో కలిసి కూనంనేని మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని హరీశ్​రావు దొంగమాటలు చెప్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘బీఆర్ఎస్​ ప్రభుత్వ హయంలో 75 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఎక్కువ చూపించారంటూ అప్పట్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి , ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు.  2017లో  75 లక్షల టన్నుల బొగ్గు ఎక్కువగా చూపెట్టారని, ఇది సత్యం స్కాం లాంటిదని ఆనాటి కేంద్ర విజిలెన్స్ కమిషన్  చౌదరికి ఫిర్యాదు చేశారు.

 ఇప్పుడు 45 లక్షల టన్నుల స్కాం  అయితే.. అప్పుడు 75 లక్షల టన్నుల బొగ్గు స్కాం కాదా? ఇప్పుడు దొంగతనం జరిగింది అంటే.. అప్పుడు కూడా దొంగతనం చేసినట్టే కదా’ అని హరీశ్​ రావును కూనంనేని నిలదీశారు. ఆయన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, అసత్యాలు మానేసి, బొగ్గు నిల్వలపై అనుమానం ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చని సూచించారు. 

కేంద్రం తెచ్చిన వేలం విధానానికి బీఆర్ఎస్ సపోర్ట్​ చేసింది​ 

2015 లో మైన్ లకు కేంద్రం వేలం విధానం తెస్తే.. బీఆర్​ఎస్​ ప్రభుత్వం సపోర్ట్ చేసిందని కూనంనేని అన్నారు. దీని వల్ల సింగరేణి ఊపిరి తీసినట్టు అయ్యిందన్నారు. ఆ తర్వాత వేలంలో పాల్గొనొద్దని వదిలేశారని.. అలా రెండు మైన్స్ పోయాయన్నారు. సింగరేణి ఉన్నా.. కొన్ని మైన్స్ ను ప్రవేట్ సంస్థలకు ఇచ్చారన్నారు. సింగరేణి పేరుతో రూ.26 వేల కోట్లు జెన్ కో వంటి సంస్థల పేరుతో అప్పు చేశారని తెలిపారు.

 దీంతో వారు కార్మికులకు మేలు చేసినట్టా? నష్టమా చేసినట్టా? చెప్పాలన్నారు. రుణాల కోసమో లేదా రేటింగ్ కోసమో 40 లక్షల టన్నుల బొగ్గు లేనిది ఉన్నట్టు సింగరేణి సంస్థ తప్పుడు లెక్కలు చూపిందని కూనంనేని తెలిపారు. కానీ, బొగ్గు మొత్తం దొంగతనం జరిగినట్టు హరీశ్​ రావు మాట్లాడుతున్నారని అన్నారు. హరీశ్​రావుతో తనకు ఎలాంటి పంచాయితీ లేదని, టీజీబీకేఎస్ యూనియన్ పంచాయితీ కోసం సింగరేణి సంస్థ ప్రతిష్టను దెబ్బతీయొద్దని, కార్మికులను అవమానించినట్టుగా మాట్లాడొద్దని కోరారు. 

కార్మికుల పక్షాన ఉన్నది ఎవరో అందరికీ తెలుసని, వారికి ఏ సమస్య ఉన్నా కొట్లాడి పోరాటం చేసేది తామేనని పేర్కొన్నారు. సింగరేణిలో సమస్యలు పరిష్కారం కాకపోతే ఆగస్టు 15 నుంచి సమ్మెకు పిలుపునిస్తామని  హెచ్చరించారు. వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ రాజకీయ పార్టీలు సింగరేణి సంస్థను రాజకీయ వేదికగా వాడుకుంటున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సింగరేణిపై మొసలి కన్నీరు కారుస్తున్నాయని, అసలు సింగరేణి సంస్థకు ఈ పార్టీలు ఏం చేశాయో చెప్పాలని సవాల్ చేశారు.