సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ గా రూ.258 కోట్లు

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ గా రూ.258 కోట్లు

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ బొనాంజా ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా కార్మికులు భారీ బోనస్ అందుకున్నారు. బోనస్ కింద రూ. 258 కోట్లు విడుదల చేసిన సింగరేణి యాజమాన్యం.. కార్మికులు, ఉద్యోగులు ఒక్కొక్కరికి రూ.64,700 చొప్పున బోనస్ పంపిణీ చేసింది. ఈ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమచేసింది. సింగరేణి చరిత్రలో ఇదే అత్యధిక బోనస్.

దసరా పండుగకు ముందు సింగరేణి యాజమాన్యం రూ.494 కోట్ల లాభాలను కార్మికులకు బోనస్‌గా పంపిణీ చేసింది. తాజాగా పంపిణీ చేసిన బోనస్‌తో కలుపుకుంటే ఒక్కో కార్మికుడు ఏకంగా లక్ష రూపాయల బోనస్ అందుకున్నట్టు.

పీఎల్‌ఆర్‌ఎస్‌ బోనస్‌ అందుకొన్న ఉద్యోగులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్. నెల వ్యవధిలో ఎక్కువ మొత్తాన్ని అందుకొన్న ఉద్యోగులు సొమ్మును వృథా చేసుకోకుండా కుటుంబ అవసరాలకు వాడుకోవాలన్నారు. గతేడాది కంపెనీకి రూ.1,766 కోట్లు లాభం వచ్చినందునే ఒక్కో కార్మికుడు సగటున రూ.లక్షకు పైగా వాటా పొందారు. ఇదే స్ఫూర్తితో పని చేసి ఉద్యోగులు కంపెనీకి మరిన్ని లాభాలు తీసుకురావాలి సూచించారు.