- మైన్‌లలో 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు
- మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలంటున్న కార్మికులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తున్న ఓపెన్‌కాస్ట్‌లలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఎండలకు మెషనరీ వేడెక్కుతోందని కార్మికులు వాపోతున్నారు. వేడి గాలులు, ఎండలతో అల్లాడుతున్నామని, కూలింగ్ రెస్ట్ షెల్టర్స్ ఏర్పాటు చేయాలని, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని కార్మికులు కోరుతున్నారు.
ముదురుతున్న ఎండలతో పరేషాన్..
ఈసారి మార్చి నెల రెండో వారం నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. బయటి ఉష్ణోగ్రతల కన్నా ఓపెన్‌కాస్ట్ మైన్స్‌లలో రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. బొగ్గు ఉత్పత్తిలో ఓపెన్కాస్ట్లే కీలక పాత్ర పోషిస్తున్నాయి. సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గులో 70 శాతం ఓసీల నుంచే వస్తోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఓసీల్లో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం విషయంలో యాజమాన్యం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి.
సింగరేణి వ్యాప్తంగా 19 ఓపెన్కాస్టులున్నాయి. ఈ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, ఓసీల నుంచి ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో యాజమాన్యం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తోంది. ఇప్పటికే 38 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, గతంలో ఏప్రిల్, మే నెలల్లో 46 డిగ్రీల నుంచి 52 డిగ్రీలు దాటిన దాఖలాలు ఉన్నాయి. ఈక్రమంలో
పని ప్రదేశాల్లో కూలింగ్ రెస్ట్ షెల్టర్స్ ఏర్పాటు చేయడంలో యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలతో మిషనరీ వేడెక్కుతుండగా, తాము ఇబ్బంది పడుతున్నామని కార్మికులు చెబుతున్నారు. సెకండ్ షిఫ్ట్ కార్మికులు పని ప్రదేశాలకు ఎండలో రావడం, ఎండలోనే మిషనరీపై పని చేయడంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నాయని డాక్టర్లు అంటున్నారు. ఏప్రిల్, మే నెలల్లో డ్యూటీల టైమింగ్స్ మార్చాలని, సెక్యూరిటీ గార్డులు, వర్క్‌షాప్, ఓసీకార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు.
ఎండలు ముదురుతున్నాపట్టించుకోవట్లె..
ఎండలు ముదురుతున్నా యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఈసారి మార్చి రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగాయి. యాజమాన్యం మాత్రం కార్మికులను పట్టించుకోవడం లేదు. ఎక్కువ ఉత్పత్తి గురించి పదేపదే చెప్పే యాజమాన్యం ప్రతి కార్మికుడికి రెండు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలి
- మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు-
మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలి
ఓపెన్‌కాస్టు కార్మికులతో పాటు ఇతర విభాగాల్లో పని చేసే కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు ఇప్పటి నుంచే పంపిణీ చేయాలి. ఎండలు ముదిరిన తర్వాతనే ఇస్తామనే ఆలోచనను యాజమాన్యం విరమించుకోవాలి. ప్రత్యేక అవసరాల దృష్ట్యా మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, చల్లటి మంచినీరు, రెస్ట్ షెల్టర్స్ అందుబాటులో ఉంచాలి. డ్యూటీ టైమింగ్స్ మార్చాలి.
- కె. రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, గుర్తింపు సంఘం(ఏఐటీయూసీ)
