- ఈసారి మొత్తం 20 బహుమతులతో ఆల్ టైం రికార్డ్
- సీఎండీ బలరాం అభినందనలు
హైదరాబాద్, వెలుగు: ఇటీవల నాగపూర్‌లో జరిగిన 54వ ఆల్ ఇండియా మైన్స్ రెస్క్యూ పోటీలలో సింగరేణి మెన్స్ టీం చాంపియన్ షిప్ సాధించగా మహిళల టీమ్ రెండో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా మొత్తం 36 జట్లు పాల్గొన్న ఈ పోటీలలో సింగరేణి టీమ్ లు అత్యధికంగా 20 మెడల్స్ దక్కించుకొని ఆల్ టైం రికార్డ్ సాధించింది. కప్పు గెలిచి హైదరాబాద్ చేరుకున్న జట్లను సింగరేణి సీఎండీ బలరామ్ అభినందించారు. గురువారం సింగరేణి భవన్లో క్రీడాకారులకు అభినందన కార్యక్రమాన్ని సంస్థ ఏర్పాటు చేసింది.
లోకల్‌గా అందుబాటులో లేని సీఎండీ బలరామ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. సింగరేణి ప్రతిష్టను దేశ వ్యాప్తం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయిలో పథకాలు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా రెస్క్యూ జీఎం శ్రీనివాసరెడ్డి సింగరేణి రెస్క్యూ జట్లు సాధించిన విజయాలను వివరించారు. పురుషుల టీమ్ ఈ సారి టీమ్ చాంపియన్ షిప్ ను, మహిళా జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించిందని పేర్కొన్నారు.

