ఖననం చేసిన  మృతదేహానికి రీ పోస్టుమార్టం.. పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఘటన

ఖననం చేసిన  మృతదేహానికి రీ పోస్టుమార్టం.. పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఘటన

పెద్దపల్లి, వెలుగు: పది రోజుల క్రితం ఖననం చేసిన వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు పోస్ట్​మార్టం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలకేంద్రానికి చెందిన కనికిరెడ్డి బాపు(61) సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి. సుమారు 12 రోజుల క్రితం గడ్డి కోయడానికి పొలం వద్దకు వెళ్లిన ఆయన అక్కడే మృతిచెందాడు.

గుండెపోటుతో మృతిచెందినట్లు భావించి అదే రోజు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు. బాపు మృతిపై కుటుంబ సభ్యుల్లో అనుమానాలు వ్యక్తం కావడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో ఖననం చేసిన మృతదేహాన్ని సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై రమేశ్, ఓదెల తహసీల్దార్ ధీరజ్, రెవెన్యూ అధికారులు, డాక్టర్ల సమక్షంలో గురువారం బయటకు తీయించారు. వైద్య బృందం ఘటనా స్థలంలోనే పోస్ట్​మార్టం నిర్వహించారు. నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.