భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: క్రిటికల్ మినరల్స్ విభాగంలోకి సింగరేణి వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు బొగ్గు, విద్యుత్ ఉత్పత్తికే ప్రాధాన్యత ఇస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ ఇప్పుడు కొత్తగా క్రిటికల్ మినరల్స్ మైన్స్ వైపు దృష్టి సారించింది. తెలంగాణతో పాటు ఏపీలో క్రిటికల్ మినరల్స్ మైన్స్‌ను దక్కించుకునేందుకు బిడ్స్ వేసేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది.
తెలంగాణతో పాటు ఏపీలో..
క్రిటికల్ మినరల్స్‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా 20 మినరల్బ్లాక్లకు బిడ్స్ పిలిచేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. మొదటిసారిగా సింగరేణి కాలరీస్ సంస్థ క్రిటికల్ మినరల్స్ మైన్స్‌ను దక్కించుకునేందుకు బిడ్స్‌లో పాల్గొనుంది. మొదటి దశలో తెలంగాణలోని వికారాబాద్, ఏపీలోని అల్లూరి సీతారామరాజు, కర్నూల్ ప్రాంతాల్లోని మినరల్స్ మైన్స్‌ను దక్కించుకునేందుకు సంస్థ కసరత్తు చేస్తోంది.
వికారాబాద్‌లో టైటానియం, వెనిడియం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గ్రాఫైట్, కర్నూల్ జిల్లాలో మోలిబ్ డెనిమ్, మినరల్స్ బ్లాక్‌లను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. బిడ్స్‌లో పాల్గొనేందుకు అవసరమైన వివరాలను యాజమాన్యం సేకరిస్తోంది.
ఇందుకోసం అనుభవం కలిగిన నిపుణులతో యాజమాన్యం చర్చిస్తోంది. లాభనష్టాలపై బేరీజు వేస్తూ ముందుకు సాగుతోంది. దేశవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్‌కు సంబంధించి 20 బ్లాక్‌లను కేంద్రం ఇప్పటికే వేలంలో పెట్టింది. సెప్టెంబర్ 21 వరకు బిడ్స్ వేసేందుకు కేంద్రం గడువు పెట్టింది. ఈక్రమంలో బిడ్స్‌లో పాల్గొనేందుకు సింగరేణి యాజమాన్యం ఇప్పటికే సంస్థలోని ఉన్నత స్థాయి అధికారులతో ఓ కమిటీ వేసింది.
ఒక్కో అడుగు ముందుకు..
బొగ్గు ఉత్పత్తిరంగంలో 135 ఏండ్లకు పైగా అనుభవం ఉన్న సింగరేణి సంస్థ విద్యుత్ ఉత్పత్తిలోనూ సత్తా చాటుతోంది. జైపూర్‌లో ఏర్పాటు చేసిన ఎస్టీపీపీ దేశంలోనే ప్రసిద్ధి చెందింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలోనూ సింగరేణి విజయవంతంగా ముందుకు సాగుతోంది.
ఇప్పుడు కొత్తగా క్రిటికల్ మినరల్స్ రంగంలోకి సింగరేణి అడుగు పెడుతూ మొదటి దశలోనే తాను అనుకున్న మూడు బ్లాక్‌లను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. తెలంగాణ, ఏపీలోని ఈ మూడు బ్లాక్‌లను వేలంలో దక్కించుకున్న తర్వాత ఆ అనుభవంతో దేశంతో పాటు విదేశాల్లోనూ క్రిటికల్ మినరల్స్ బ్లాక్లపై దృష్టి సారిస్తామని యాజమాన్యం పేర్కొంటోంది.
