- ముగ్గురు అరెస్ట్
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కేసు వివరాలను ఏసీపీ ఎం.రమేశ్, సీఐ ప్రసాదరావు వెల్లడించారు.
ఏప్రిల్ 29న ఇంటి నుంచి వెళ్లిన వంశీ కనిపించకపోవడంతో అతని తల్లి శంకరమ్మ మే 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి కాల్ డేటా ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన అలేఖ్య, ఆమె భర్త నీలం నవీన్, వారి స్నేహితుడు భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.
పదో తరగతి చదువుతున్న సమయంలో అలేఖ్యను ప్రేమించిన వంశీ.. ఇటీవల ఆమెను ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో వేధించాడు. హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. దీంతో నవీన్ తన స్నేహితుడు భాస్కర్‌తో కలిసి వంశీని హత్య చేయాలని పథకం రచించాడు.
ఏప్రిల్ 30న వంశీని హైదరాబాద్‌కు పిలిపించి మద్యం తాగించి కత్తితో పొడిచి చంపారు. అనంతరం డెడ్‌బాడీని ప్లాస్టిక్ కవర్లు, మ్యాట్‌లో చుట్టి కారులో తీసుకెళ్లి మంథని మండలం గాడుదుల గండి వద్ద లోయలో పడేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కారు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
