సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలి..సమాజం కోసం ప్రజల్లో చైతన్యం రావాలి

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలి..సమాజం కోసం ప్రజల్లో చైతన్యం రావాలి
  • ప్రజలకు మంత్రి సురేఖ పిలుపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సింగిల్ యూజ్ ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధించాలని పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్ 5 ) సందర్భంగా శుక్రవారం సనత్ నగర్‌లోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహించారు. దీనికి కొండా సురేఖ చీఫ్ గెస్టుగా హాజరై, మాట్లాడారు.

" ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజల్లో  చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. 15 రోజులకొకసారి గ్రామాల్లో, పట్టణాల్లో ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలి. అడవుల నరికివేత, గ్లోబల్ వార్మింగ్ కారణంగానే కొత్త రోగాలు వస్తున్నాయి. పంట దిగుబడి తగ్గుతున్నది" అని చెప్పారు. 

పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి సురేఖ పేర్కొన్నారు. పర్యావరణ రూల్స్ ఉల్లంఘించినందుకు గతేడాది కాలంలో 629 పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకున్నామని టీజీపీసీబీ సభ్య కార్యదర్శి జి. రవి వెల్లడించారు. గాలి నాణ్యత పెంచేందుకు రాష్ట్రాల వారీగా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు చెప్పారు.