- ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఇప్పటికే మ్యాపింగ్ చేసిన ఎన్నికల కమిషన్
- 2002 జాబితాలో ఉన్న ఓటర్లపై ఫీల్డ్ వెరిఫికేషన్
- 40 శాతానికి పైగా మ్యాపింగ్ కాలే
- ప్రస్తుతం రాష్ట్రంలో 3.39 కోట్ల మంది ఓటర్లు
- రాష్ట్రంలో ఏప్రిల్ లేదా మే నెలలో సర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియలో హైదరాబాద్ అట్టడుగున నిలిచింది. రాష్ట్ర సగటు మ్యాపింగ్ 53 శాతంగా నమోదైతే.. భాగ్యనగరం కేవలం 28 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 2002 నాటి పాత ఓటర్ల జాబితాకు, ప్రస్తుత 2025 జాబితాకు పొంతన కుదరకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్తున్నప్పటికీ చాలామంది ఓటర్ల వివరాలు దొరకకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఓటర్ల లెక్క తేల్చడం ఎన్నికల కమిషన్‌కు ఇప్పుడు ఒక పెద్ద ‘టాస్క్’లా పరిణమించింది.
పల్లె ముందు.. పట్నం వెనక
ఓటర్ల వెరిఫికేషన్ విషయంలో పల్లెలు ముందంజలో ఉంటే పట్నం మాత్రం వెనకబడింది. సిద్దిపేట జిల్లా 80 శాతం మ్యాపింగ్‌తో టాపర్‌గా నిలవడం విశేషం. రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలు కూడా 70 శాతానికి పైగా పూర్తి చేసి ఆదర్శంగా నిలిచాయి. అయితే ఐటీ హబ్‌లుగా పేరున్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు మాత్రం వరుసగా 30 శాతం, 44 శాతంతో నత్తనడకన సాగుతున్నాయి. వరంగల్, సంగారెడ్డి జిల్లాల్లో సైతం పరిస్థితి ఆశాజనకంగా లేదు. అద్దె ఇళ్లు మారడం, ఓటర్లు నిరంతరం వలసలు వెళ్లడం వల్ల వివరాల సేకరణ కష్టంగా మారిందని క్షేత్రస్థాయి సిబ్బంది వాపోతున్నారు. బస్తీలు, కాలనీల్లో ఓటర్ల జాడ కోసం బీఎల్‌వోలు స్థానిక పెద్దల సహాయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల ఉదాసీనత కూడా ఈ ప్రక్రియ నెమ్మదించడానికి ఒక కారణమని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 3.39 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇందులో 40 శాతానికి పైగా ఓటర్ల మ్యాపింగ్ సరిగా జరగకపోవడం ఆందోళనకరం. 2002 జాబితాలో ఉన్న ఓటర్లలో దాదాపు కోటిన్నర మందికి పైగా వివరాలు ఇప్పటికీ సరిపోలడం లేదని తెలుస్తున్నది. ఉమ్మడి ఏపీలో చివరిసారిగా చేపట్టిన ఆ సర్వే వివరాలను ప్రస్తుత సమాచారంతో అనుసంధానం చేయడం క్లిష్టంగా మారింది. ముఖ్యంగా చనిపోయిన వారి పేర్లు తొలగించడం, అడ్రస్ మారిన వారిని గుర్తించడం పెద్ద సవాలుగా మారింది. 2002 ఓటర్లను 2025 జాబితాతో పోల్చే క్రమంలో రెండు పద్ధతులను అధికారులు అనుసరిస్తున్నారు. ఒకటి డైరెక్ట్ మ్యాపింగ్ కాగా, రెండోది వారసత్వ (ప్రోజెనీ) మ్యాపింగ్ విధానం అని సీఈఓ తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు ప్రతి 250 మంది ఓటర్లను ఒక యూనిట్‌గా తీసుకుని వెరిఫికేషన్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఈ మ్యాపింగ్ పూర్తయితేనే ఓటర్ల జాబితాలో ఉన్న అసంబద్ధతలు తొలగిపోయే అవకాశం ఉంటుంది.
నానా తంటాలు పడుతున్న బీఎల్వోలు
దొంగ ఓట్లకు చెక్ పెట్టేందుకు అధికారులు 'ప్రోజెనీ' (వారసత్వ) మ్యాపింగ్‌ను చేస్తున్నారు. ఎవరి పేరైతే 2025 జాబితాలో ఉండి, పాత జాబితాలో లేదో వారి పూర్వీకుల రికార్డులను పరిశీలిస్తారు. వారి తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల రికార్డులను 2002 జాబితాలో వెతికి అనుసంధానం చేస్తారు. దీనివల్ల ఓటరు స్థానికతపై పూర్తిస్థాయి స్పష్టత రావడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. వారసత్వ వివరాలు సేకరించి అనుసంధానం చేయడంతో తప్పుడు ఓట్లను ఏరివేసే అవకాశం కలుగుతుంది. సిటీల్లో చిరునామాల అస్పష్టత వల్ల వివరాల సేకరణకు బీఎల్‌వోలు నానా తంటాలు పడాల్సి వస్తోంది. కాలనీ సంఘాల ప్రతినిధులు, బస్తీ పెద్దలను అడిగి మరీ సమాచారం సేకరిస్తున్నా ఫలితం ఆశించినంతగా లేదు. ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసమే ఈ కసరత్తు చేస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్ల లిస్ట్‌తో చెక్
గతంలో ఓటర్ల తనిఖీలు కేవలం రాష్ట్ర పరిధికే పరిమితం కాగా, ఇప్పుడు అది మారింది. తాజాగా ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించి ‘ఎరోనెట్’ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఒక ఓటరుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు ఉందో లేదో సరిచూస్తారు. డూప్లికేట్ ఓట్లు, రెండు చోట్ల ఓటు ఉన్న వారిని ఆన్‌లైన్ ద్వారా సులభంగా గుర్తించి తొలగించవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి వివరాలను కూడా దీని ద్వారా నిశితంగా ధ్రువీకరిస్తారు. ఇది ఓటర్ల జాబితాలో అవకతవకలను అరికట్టేందుకు ఒక పెద్ద విప్లవాత్మక మార్పుగా అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండే అవకాశమే ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఎక్కడైనా అక్రమంగా ఓటు నమోదు చేయించుకున్నా ఈ టెక్నాలజీతో సులభంగా పట్టుబడనున్నారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక నోటిఫికేషన్ వెలువడగానే ఈ కసరత్తును పూర్తి చేయనున్నారు. అప్పటిలోగా రాజకీయ పార్టీలు తమ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని సీఈవో సూచించారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలకు పార్టీల ఏజెంట్లు సహకరిస్తే మ్యాపింగ్ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నదంతా కేవలం ముందస్తు సన్నాహక తనిఖీలు మాత్రమేనని అధికారులు చెప్పారు. ఏప్రిల్ నాటికి మ్యాపింగ్ సమస్యలన్నీ అధిగమించి పక్కాగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
