సిరిసిల్ల నేతన్నలకు చీరల పైసలు.. 90 శాతానికి పైగా ఇందిరమ్మ చీరల ఆర్డర్లు సిరిసిల్లకే

సిరిసిల్ల నేతన్నలకు చీరల పైసలు.. 90 శాతానికి పైగా ఇందిరమ్మ చీరల ఆర్డర్లు సిరిసిల్లకే
  • ఇప్పటికే రూ.236 కోట్లు చేనేత కార్మికుల ఖాతాల్లో జమ
  • కోటికి చేరువలో చీరల ఉత్పత్తి.. ఏడాదంతా చేతినిండా పని
  • ఇందిరమ్మ చీరలతో సిరిసిల్ల చేనేత కార్మికులకు భరోసా

ఇందిరమ్మ మహిళా శక్తి పథకం సిరిసిల్ల నేతన్నల జీవితాల్లో కొత్త ఆశలు నింపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భారీ చీరల ఆర్డర్లతో ఏడాదంతా ఉపాధి లభించడమే కాకుండా, ఉత్పత్తి చేసిన చీరలకు సంబంధించిన చెల్లింపులను కూడా వేగంగా విడుదల చేస్తుండటంతో వస్త్ర పరిశ్రమ మళ్లీ గాడిన పడుతోంది. గతంలో బతుకమ్మ చీరల బకాయిలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నేతన్నలు ఇప్పుడు సమయానికి బిల్లులు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఉత్పత్తి చేస్తున్న ఇందిరమ్మ చీరల ఆర్డర్లలో 90 శాతానికి పైగా సిరిసిల్ల నేతన్నలకే కేటాయించింది. ఈ చీరల ఉత్పత్తికి సంబంధించి మొత్తం రూ.276 కోట్లలో ఇప్పటివరకు రూ.236 కోట్లను నేతన్నల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రూ.40 కోట్లను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో సిరిసిల్ల నేతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు రెండేసి చీరలు అందజేస్తున్నారు.

ఇప్పటికే గ్రామీణ మహిళలకు తొలి విడత చీరలను పంపిణీ చేశారు. ఇందుకోసం సిరిసిల్ల చేనేత కార్మికులు గ్రామీణ ప్రాంతాల కోసం 65 లక్షల చీరలు, పట్టణ మహిళల కోసం మరో 40 లక్షల చీరలను ఉత్పత్తి చేశారు. దాదాపు కోటి చీరలను టెస్కోకు అందజేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్డర్లు ఇవ్వగా, మే నెలలో ఉత్పత్తి ప్రారంభమైంది. టెస్కో వస్త్రాలను కొనుగోలు చేసిన నెల రోజుల్లోనే విడతల వారీగా చెల్లింపులు చేస్తూ వస్తోంది. మొత్తం రూ.276 కోట్లలో ఇప్పటికే రూ.236 కోట్లు విడుదల కాగా, మిగిలిన రూ.40 కోట్లు త్వరలోనే చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌ హయాంలో సంక్షోభం..

బీఆర్​ఎస్​ హయాంలో బతుకమ్మ చీరలు నేసిన నేతన్నలకు దాదాపు రెండేళ్లపాటు బకాయిలు చెల్లించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అప్పులు చేసి ఉత్పత్తి పూర్తి చేసిన నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి వంద రోజుల్లోనే పెండింగ్ బకాయిలుగా రూ.100 కోట్లు విడుదల చేసింది. అనంతరం 2024–25లో ఇందిరమ్మ చీరలు ఆర్డర్లు ఇవ్వడంతో పరిశ్రమ మళ్లీ గాడిన పడిందని నేతన్నలు చెబుతున్నారు.

కార్మికులకు ఏడాదంతా ఉపాధి..

ఇందిరమ్మ చీరల ఉత్పత్తితో సిరిసిల్లలో కార్మికులకు ఏడాదంతా ఉపాధి లభిస్తోంది. ఉత్పత్తి పూర్తి కాగానే ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించడంతో ఆర్థిక భారం తగ్గిందని నేతన్నలు అంటున్నారు. ప్రస్తుతం ఒక్కో కార్మికుడు నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదిస్తున్నారని, వరుసగా రెండు విడతల చీరల ఉత్పత్తితో వస్త్ర పరిశ్రమలో స్థిరత్వం ఏర్పడిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.