- ప్రాణం ఉన్నంత వరకు సిరిసిల్ల అభివృద్ధి కోసమే పనిచేస్త
- రెండేండ్లయితే తిరిగి బీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుంది
- సిరిసిల్లలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాజన్నసిరిసిల్ల/వేములవాడ, వెలుగు : ‘నాకు జన్మనిచ్చింది నా తల్లి శోభమ్మ అయితే.. రాజకీయ భిక్ష పెట్టింది మాత్రం సిరిసిల్లనే, ఈ గడ్డను ఎప్పటికీ మరువబోను’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల ప్రజల కోసం తాను ఏం చేసినా తక్కువేనన్నారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, ప్రతి కార్యకర్తను ఆర్థికంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
వేములవాడ, సిరిసిల్లలో శనివారం జరిగిన నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడారు. తాను సిరిసిల్ల ఎమ్యెల్యేనని గల్లా ఎగరేసి మరీ గర్వంగా చెప్పుకుంటానన్నారు. సిరిసిల్లలోని పవర్‌లూం ఇండస్ట్రీని ఆదుకునేందుకే బీఆర్‌ఎస్ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కొలువుదీరగానే తన మీద ఉన్న కోపంతో సిరిసిల్ల బతుకమ్మ చీరల ఆర్డర్‌ను రద్దు చేశారని విమర్శించారు. నేత కార్మికుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి బతుకమ్మ చీర కాన్సెప్ట్ అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. మోసపోతే గోసపడుతామని ఎన్నికల ముందు కేసీఆర్ పదే పదే చెప్పారని, కానీ ప్రజలు వినకుండా కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండించిన అన్ని పంటలను కొనుగోలు చేశామని, ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏ పంటను కూడా కొంటలేదని మండిపడ్డారు. రైతన్నలు కాళ్లు పట్టుకొని ప్రాధేయపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూరియా కోసం చెప్పుల లైన్లు చూస్తున్నామని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు చనిపోతున్నారన్నారు.
రైతుల ధాన్యానికి సంచులు లేవు కానీ, రాహుల్‌గాంధీకి మాత్రం సంచులు పోతున్నాయన్నారు. ఇచ్చిన హామీలు నేరవేర్చలేని సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కరేనన్నారు. కాంగ్రెస్ సినిమా ఫెయిల్ అయిందని, ఆ పార్టీ మరోసారి గెలిచే పరిస్థితి లేదన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలందరికీ డిజిటల్ ఐడీ కార్డులిస్తామన్నారు. ‘సర్’ కార్యక్రమంలో భాగంగా 18 ఏండ్లు నిండిన యువత ఓటుహక్కు నమోదు చేసుకోవాలని, అవకతవకలను సరిద్దిద్దుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు జీవన్‌రెడ్డి, ప్రవీణ్, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, తుల ఉమ, జిందం చక్రపాణి పాల్గొన్నారు.
