బషీర్బాగ్, వెలుగు: బీసీలందరూ రాజ్యాధికారం సాధించే వరకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. సోమవారం కాచిగూడలో బీసీ డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్ కోల జనార్దన్ అధ్యక్షతన, బీసీ జేఏసీ వర్కింగ్ ఛైర్మన్ గుజ్జ కృష్ణ నేతృత్వంలో బీసీ సంఘాల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా వివిధ కుల, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు చర్చించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్, ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, టి.చిరంజీవులు, బూర నర్సయ్యగౌడ్, జాజుల శ్రీనివాస్ గౌడ్, బి.ఎస్ రాములు, చెరుకు సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలంతా ఏకమైతేనే రాజకీయ అధికారం సాధ్యమని స్పష్టం చేశారు.
