స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్​గా సిరిసిల్ల రాజయ్య

స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్​గా సిరిసిల్ల రాజయ్య
  •  సభ్యులుగా సుధీర్ రెడ్డి, మురళీ నాయక్, రమేశ్
  • వక్ఫ్ బోర్డు చైర్మన్​గా అజ్మత్ ఉల్లా హుస్సేన్

హైదరాబాద్, వెలుగు : స్టేట్ ఫైనాన్స్​కమిషన్​ చైర్మన్ (ఎస్ఎఫ్​సీ)గా వరం గల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను గవర్నర్  తమిళిసై నియమించారు. ఆయనతో పాటు సూర్యా పేట జిల్లాకు చెందిన, ప్రస్తుత పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న సంకేపల్లి సుధీర్ రెడ్డి,  వికారాబాద్  జిల్లాకు చెందిన  మల్కుడ్  రమేశ్,  మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​కు చెందిన మురళీ నాయక్​ను సభ్యులుగా నియమించారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేండ్ల పాటు వారు పదవిలో ఉంటారని నోటిఫికేషన్ లో గవర్నర్  పేర్కొన్నారు.

 పంచాయతీ రాజ్  చట్టం 2018లోని  244 సెక్షన్  ప్రకారం రాష్ర్టంలో రెండో ఎస్ఎఫ్ సీని నియమించామని ఆమె తెలిపారు. ఇక గవర్నర్  నోటిఫికేషన్​కు అనుగుణంగా  పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. రాష్ర్టంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ లు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు అందించాల్సిన పన్నుల వాటా, గ్రాంట్లను రాజ్యాంగబద్ధంగా పంపిణీ చేయడానికి ఎస్ఎఫ్ సీ పలు సిఫార్సులు చేసి రిపోర్టులను గవర్నర్ కు, రాష్ర్ట ప్రభుత్వానికి అందజేస్తుంది. 

కాగా, రాష్ర్ట ప్రభుత్వం ఫైనాన్స్ కషన్​ను 2015 లో ఏర్పాటు చేయగా 2017లో చైర్మన్, మెంబర్లను నియమించింది. వారు తమ టర్మ్  ముగిసే టైమ్​లో రాష్ర్ట ప్రభుత్వానికి పలు సిఫార్సులతో అందజేసిన రిపోర్టును అసెంబ్లీలో నాటి బీఆర్ఎస్  ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. గవర్నర్​కు అందజేయనూ లేదు. గత ఏడాది జులైలో ఎస్ఎఫ్​సీ చైర్మన్​గా మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, మెంబర్లుగా శ్రీనివాస్ యాదవ్, సలీంలను నియమిస్తూ సీఎంవో నోట్  వెల్లడించింది.  గవర్నర్ నుంచి నోటిఫికేషన్  రాకపోవడంతో వాళ్లు బాధ్యతలు చేపట్టలేదు.
 
తెలంగాణ వక్ఫ్  బోర్డు చైర్మన్ గా  అజ్మత్  ఉల్లా

తెలంగాణ వక్ఫ్  బోర్డు చైర్మన్ గా  అజ్మత్  ఉల్లా హుసేన్  ఎన్నికయ్యారు. కాంగ్రెస్  పార్టీలో విద్యార్థి దశ నుంచి క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు పీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ గా ఆయన పనిచేశారు. వక్ఫ్  బోర్డులో ఇటీవల హుస్సేన్​ను డైరెక్టర్​గా నియమించడంతో బోర్డులోని ఇతర డైరెక్టర్లు చైర్మన్ ను ఎన్నుకున్నారు.