టీఎస్‌‌పీఎస్సీ పేపర్ల లీక్‌‌లో మరో ఇద్దరి అరెస్ట్

టీఎస్‌‌పీఎస్సీ పేపర్ల లీక్‌‌లో మరో ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్‌‌,వెలుగు : టీఎస్‌‌పీఎస్సీ క్వశ్చన్​ పేపర్స్​ లీకేజీ  కేసులో  సిట్‌‌ మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన అజ్మీర్‌‌ ‌‌పృథ్వీరాజ్‌‌, ఆదిలాబాద్‌‌ జిల్లాకు చెందిన రాజేశ్వర్‌‌‌‌ జాదవ్‌‌ను గురువారం అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌కు తరలించింది. అజ్మీర్ పృథ్వీరాజ్‌‌ ఖమ్మం జిల్లా చిన్నమదంపల్లి గ్రామ జూనియర్‌‌ ‌‌పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. రాజేశ్వర్ జాదవ్‌‌ ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌‌ ‌‌మండల తహసీల్దార్​ ఆఫీస్‌‌లో ఔట్‌‌సోర్సింగ్‌‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ దళారి మురళీధర్‌‌ ‌‌వద్ద ఏఈ, ఏఈఈ పేపర్స్ కొనుగోలు చేశారు. పృథ్వీరాజ్‌‌ రూ.2 లక్షలతో అసిస్టెంట్‌‌ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌‌  పేపర్‌‌‌‌, రాజేశ్వర్‌‌‌‌ అసిస్టెంట్‌‌ ఇంజినీర్‌‌ ‌‌(సివిల్‌‌) పేపర్ కొన్నాడు. ఈ ఇద్దరి అరెస్ట్​తో ఈ కేసులో అరెస్ట్​అయిన నిందితుల సంఖ్య 37కు చేరింది.

లీకుల లింకులు ఇలా..


టీఎస్‌‌పీఎస్సీ డేటాబేస్​తో పాటు నిందితులు ప్రవీణ్‌‌, రాజశేఖర్‌‌‌‌రెడ్డి, రేణుక ఇచ్చిన సమాచారంతో గ్రూప్స్, ఏఈ, ఏఈఈ, డీఏవో పరీక్షలు రాసిన అభ్యర్థుల వివరాలను సిట్ సేకరించింది. ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను గుర్తించి నిందితులతో వారికి ఉన్న లింకులను ట్రేస్ చేస్తున్నది. ఇందులో భాగంగా రాజశేఖర్‌‌‌‌రెడ్డి భార్య సుచరిత, రేణుక సోదరుడు రాజేశ్వర్‌‌, వదిన శాంతికి డీఏవో పరీక్షల్లో టాప్‌‌ మార్కులు వచ్చినట్లు గుర్తించింది. వీరితో పాటు మరో ఇద్దరిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించింది. ప్రవీణ్‌‌ నుంచి దళారులు మురళీధర్‌‌‌‌రెడ్డి, మనోజ్‌‌లు కొనుగోలు చేసిన పేపర్స్‌‌ను ఎవరెవరికి సేల్‌‌ చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలో మురళీధర్‌‌‌‌ ఇచ్చిన సమాచారంతో పృధ్వీరాజ్‌‌, రాజేశ్వర్‌‌ ‌‌జాదవ్‌‌ను అరెస్ట్‌‌ చేసింది.

ఇద్దరు నిందితులకు బెయిల్ నిరాకరణ


టీఎస్‌‌పీఎస్సీ పేపర్స్​ లీకేజీ కేసులో ఇద్దరు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌‌ను హైకోర్టు కొట్టేసింది. సాయి లౌకిక్, సాయి సుష్మిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌‌ను డిస్మిస్ చేస్తూ గురువారం సమ్మర్ వెకేషన్ కోర్టు జడ్జి జస్టిస్ సాంబశివరావు నాయుడు తీర్పు చెప్పారు. ఈ కేసులో పలువురు నిందితులకు ఇప్పటికే బెయిల్ వచ్చిందని, పిటిషనర్లు 42 రోజులుగా జైల్లోనే ఉన్నారని, వీరికి కూడా బెయిల్ ఇవ్వాలని వారి తరఫు లాయర్ కోరారు. ప్రశ్నపత్రాన్ని సాయి సుష్మిత అక్రమంగా పొంది పరీక్ష రాశారని, ఆమె భర్త సాయి లౌకిక్ ఆ పేపర్లను ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకున్నాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. వారిద్దరికీ బెయిల్ ఇవ్వద్దని కోరారు. ప్రభుత్వ లాయర్‌‌‌‌తో వాదనతో ఏకీభవించిన హైకోర్టు వారికి బెయిల్‌‌ మంజూరు చేయడానికి నిరాకరించింది.