శ్రవణ్ రావుకు బిగ్ షాక్.. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరిన సిట్

శ్రవణ్ రావుకు బిగ్ షాక్.. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరిన సిట్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు శ్రవణ్ రావు బెయిల్ రద్దు చేయాలని సిట్ సుప్రీంకోర్టును కోరింది. విచారణకు సహకరించడం లేదని.. బెయిట్ రద్దు చేసి కస్టడీకి అప్పగించాలని రిక్వెస్ట్ చేసింది సిట్. కాగా, తెలంగాణ పాలిటిక్స్‎ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు నిందితుడు. ఈ కేసు నమోదు కాగానే అతడు విదేశాలకు పారిపోయాడు. అయితే.. ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శ్రవణ్ రావు విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. పూర్తిస్థాయిలో సిట్ విచారణకు సహకరిస్తానని కోర్టుకి చెప్పాడు. చెప్పినట్లుగానే సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు.. పోలీసులకు మాత్రం సహకరించడం లేదు. 

విచారణకు సహకరించకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాడిన ఫోన్లు ఇవ్వాలని సిట్ కోరగా.. తుప్పు పట్టిన ఫోన్ ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. విచారణకు సహకరించకపోవడంతో శ్రవణ్ రావు బెయిల్ రద్దు చేసి..  జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇవ్వాలని సిట్ సుప్రీంకోర్టును కోరింది. దీంతో సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతిస్తే.. విచారణలో శ్రవణ్ రావు ఎలాంటి విషయాలు చెపుతాడనే దానిపై ఆసక్తి నెలకొంది. 

ఫోన్‌‌ ట్యాపింగ్ సమయంలో రెండు సెల్‌‌ ఫోన్లు..! 

గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్‌‌కు గురైన ఫోన్‌‌ నంబర్లు.. వాటిని ప్రణీత్‌‌ రావు టీమ్‌‌కు పంపించిన మొబైల్ ఫోన్‌‌ నంబర్ల ఆధారంగా.. ట్యాపింగ్‌‌లో శ్రవణ్‌‌ రావు పాత్రను సిట్ అధికారులు గుర్తించారు. ఫోరెన్సిక్‌‌ రిపోర్ట్స్‌‌ ఆధారంగా ఫోన్ నంబర్లతో లింకైన ఐఎంఈఐ నంబర్లు గుర్తించారు. వీటిలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రవణ్‌‌ రావు నంబర్‌‌‌‌ నుంచి వెళ్లిన వాట్సాప్‌‌ చాటింగ్‌‌లు, ప్రణీత్‌‌ రావుకు ఆయన పంపించిన మొబైల్ నంబర్లను గుర్తించారు. 

ఈ క్రమంలోనే శ్రవణ్‌‌రావు నాలుగు ఐఎంఈఐ నంబర్లు గల రెండు సెల్‌‌ ఫోన్లను వినియోగించాడని సిట్‌‌ గుర్తించినట్టు తెలిసింది. వీటి ఆధారంగా శ్రవణ్‌‌ రావుకు ఇచ్చిన నోటీసుల్లో ఆయా ఫోన్ నంబర్లకు చెందిన ఐఎంఈఐ నంబర్లను కూడా పేర్కొన్నట్టు సమాచారం. దర్యాప్తులో భాగంగా వీటిని తమకు స్వాధీనం చేయాలని సిట్‌‌ ఆదేశించింది. మొదటిరోజు విచారణ సమయంలోనూ తదుపరి విచారణకు ఆ రెండు ఫోన్లను తీసుకురావాలని సూచించారు.