ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో కాదు నందినగర్‌‌‌‌‌‌‌‌లోనే విచారిస్తం‌‌‌‌‌‌‌‌..కేసీఆర్ కు సిట్ మరోసారి నోటీసులు

ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో కాదు  నందినగర్‌‌‌‌‌‌‌‌లోనే  విచారిస్తం‌‌‌‌‌‌‌‌..కేసీఆర్ కు సిట్ మరోసారి నోటీసులు
  • ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసులో కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు సిట్ రెండో నోటీసు
  •     నందినగర్‌‌‌‌‌‌‌‌లోని కేసీఆర్ ఇంటికి తాళం.. గోడకు అతికించిన అధికారులు
  •     ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని సూచన
  •     రికార్డుల ప్రకారం నందినగర్‌‌‌‌‌‌‌‌లోనే మీ నివాసం, అక్కడే విచారిస్తం
  •     కేసు వాస్తవాలు తెలిసిన వ్యక్తులు జ్యూరిస్​డిక్షన్ పరిధిలోనే హాజరుకావాలి
  •     ఎర్రవల్లికి రావడం కుదరదు, సహకరించండి: కేసీఆర్​కు నోటీసుల్లో సిట్‌‌‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో సిట్‌‌ దూకుడు పెంచింది. మాజీ సీఎం కేసీఆర్‌‌ను విచారించేందుకు శుక్రవారం మరోసారి నోటీసు జారీ చేసింది. బంజారాహిల్స్ నందినగర్‌‌‌‌లోని ఆయన నివాసంలోనే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని వెల్లడించింది. నిర్ణీత సమయంలో అందుబాటులో ఉండాలని సూచించింది. ఈ మేరకు 160 సీఆర్‌‌‌‌పీసీ కింద రెండో నోటీసు జారీ చేసింది. నోటీసులు ఇచ్చేందుకు శుక్రవారం రాత్రి 9.15 గంటలకు నందినగర్‌‌‌‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. కాగా, ఆ సమయంలో కేసీఆర్‌‌‌‌ ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. ఇంటి బయట ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది మినహా కేసీఆర్‌‌ పీఏ సహా ఇతర సిబ్బంది ఎవ్వరూ అందుబాటులో లేరు. నోటీసులు ఇస్తారని ముందుగానే గుర్తించి అందుబాటులో లేకుండా వెళ్లిపోయినట్లు సిట్‌‌ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు.

ఎన్నికల అఫిడవిట్‌‌,అసెంబ్లీ రికార్డుల ప్రకారమే నోటీసులు

నందినగర్‌‌‌‌లోనే విచారించడానికి గల కారణాలు నోటీసులో పేర్కొన్నారు. గురువారం జారీ చేసిన మొదటి నోటీసుకు సంబంధించి కేసీఆర్ ఇచ్చిన రిప్లే గురించి రెండో నోటీసులో ప్రస్తావించారు. ‘‘పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌లో నమోదైన క్రైమ్ నంబర్‌‌‌‌ 243/2024 కేసులో దర్యాప్తులో భాగంగా సెక్షన్ 160 సీఆర్‌‌‌‌పీసీ కింద నోటీసులు జారీ చేశాం. అధికారిక రికార్డులు, ఎన్నికల అఫిడవిట్, రాష్ట్ర శాసనసభ రికార్డులతో ప్రకారం నందినగర్‌‌‌‌లోని అడ్రస్‌‌తో నోటీసులు ఇచ్చాం. ఆ నోటీసులను అందుకున్న తర్వాత మీరు ప్రత్యుత్తరంగా వినతిపత్రం పంపారు. మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నామినేషన్లు ఉన్నందున విచారణకు హాజరుకాలేనని  రిప్లై ఇచ్చారు. 65 ఏండ్లు పైబడినందున ఎర్రవల్లిలోని ఫామ్‌‌హౌస్‌‌లోనే విచారించాలని కోరారు”అని రెండో నోటీసుల్లో వివరించారు.

చట్టపరంగానే నోటీసులు,ఫామ్‌‌హౌస్‌‌లో విచారించం

ఈ క్రమంలోనే సెక్షన్ 160 సీఆర్‌‌‌‌పీసీ గురించి సిట్ అధికారులు ప్రస్తావించారు.‘‘కేసులో వాస్తవాలు తెలిసిన వ్యక్తులు సంబంధిత పోలీస్ స్టేషన్‌‌ లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్ నందినగర్‌‌‌‌లోని మీ నివాసంలో నోటీసులు అందించాం. కానీ, మీ వయస్సును పరిగణనలోకి తీసుకుని, సెక్షన్ 160 సీఆర్‌‌‌‌పీసీ నిబంధన దృష్ట్యా, సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్‌‌హౌస్‌‌లో విచారించాలని మీరు అభ్యర్థించారు. మీ వయస్సును పరిగణనలోకి తీసుకుని, నిబంధనలకు అనుగుణంగా, మా వద్ద ఉన్న అధికారిక రికార్డుల ప్రకారం.. నందినగర్‌‌‌‌లోని మీ నివాసంలోనే విచారిస్తాం. అధికారిక రికార్డుల్లో లేని ప్రదేశంలో విచారణ జరపాలని మీరు చేసిన అభ్యర్థనను అంగీకరించడం సాధ్యం కాదు” అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, విచారణలో భాగంగా అనేక రకాల అతి సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫిజికల్‌‌ రికార్డులను పరిశీలించాల్సి ఉన్నదన్నారు. వీటిని ఎర్రవల్లికి తీసుకురావడం సాధ్యం కాదని తెలిపారు. కాబట్టి నోటీసుల్లో పేర్కొన్న విధంగా  ఫిబ్రవరి1 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌‌లోని నందినగ్‌‌లో గల అధికారిక నివాసంలో అందుబాటులో ఉండాలని సూచించారు.