హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అగ్ర నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. 2026, జనవరి 20వ తేదీ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా సిట్ హరీష్ రావుకు నోటీసులు పంపినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరీ సిట్ విచారణకు మంగళవారం (జనవరి 20) హరీష్ రావు హాజరవుతారో లేదో చూడాలి.
స్టేట్ పాలిటిక్స్‌ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపేందుకు హైదరాబాద్ పోలీస్‌కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఇటీవల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది సభ్యులను నియమించారు.
సిద్దిపేట సీపీ ఎస్‌ఎమ్ విజయ్‌కుమార్(ఐపీఎస్), రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా(ఐపీఎస్), మాదాపూర్ డీసీపీ రితిరాజ్(ఐపీఎస్), మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి(ఐపీఎస్), గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం. రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ కేఎస్ రావు, ఫోన్ ట్యాపింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, టీజీ న్యాబ్ డీఎస్పీ జీహెచ్ శ్రీధర్, హెచ్‌ఎంఆర్‌ఎల్ డీఎస్పీ నాగేందర్ రావును సభ్యులుగా నియమించారు. ఉన్నతస్థాయిలో ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ చేసి పటిష్టమైన చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
ఇప్పటికే సేకరించిన ఆధారాలతో..!
ఫోన్‌ట్యాపింగ్‌పై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన తర్వాత సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఐదుగురు సభ్యులతో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి కేసును దర్యాప్తు చేశారు. ఇటీవల డీజీపీ అధికారికంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేశారు.
కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ, ఇతర నిందితుల వాంగ్మూలాలు, సేకరించిన సాంకేతిక ఆధారాలతో సజ్జనార్ సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది ఇప్పటికే స్పెషల్ టీమ్ ప్రాథమిక సమాచారం సేకరించింది. సిటీ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కన్‌ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పలువురు కీలక నేతల పేర్లు పరోక్షంగా వెల్లడయ్యాయి.
ఆ నలుగురు.. 10 నెలల రిమాండ్
ఫోన్ ట్యాపింగ్‌లో కీలకంగా వ్యవహరించిన మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్‌రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 10 నెలలకు పైగా బెయిల్ రాకుండా కీలక ఆధారాలను కోర్టుకు అందించారు. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నాడు. ఆయనను భారత్‌కు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియ సహా అమెరికా నుంచి డిపోర్ట్ చేయించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు.
అరెస్ట్ నుంచి తప్పించుకున్న ప్రభాకర్ రావును చివరకు వారం రోజుల పాటు కస్టోడియల్ ఎంక్వైరీ చేశారు. దీంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్ ద్వారా నష్టపోయిన బాధితులు, అధికారులు కాల్ డేటా సహా వాట్సాప్, సోషల్‌మీడియా డేటాను పోలీసులు ఇప్పటికే సేకరించారు. వీటి ఆధారంగా సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా ఇటీవల పలువురికి నోటీసులు ఇచ్చి విచారించింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ యాదవ్, అతడి తండ్రిని సిట్ విచారించింది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
