
పేపర్ లీక్ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపారు. పేపర్ లీక్‌పై రేవంత్ చేసిన ఆరోపణలపై అధారాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. పేపర్ లీక్ మొత్తం మంత్రి కేటీఆర్ ఆఫీసు నుంచే వ్యవహారం సాగిందని, మంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా? అని రేవంత్ ఇటీవల ప్రశ్నించారు. ఇందులో కేటీఆర్ పాత్ర కూడా ఉందన్నారు. లీకేజీ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్, మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి ఇద్దరూ దోస్తులని, రాజశేఖర్‌కు ఉద్యోగం ఇప్పించింది మంత్రి పీఏనేనని, ఆయన సూచనలతోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి టీఎస్ పీఎస్సీకి బదిలీ చేశారని రేవంత్ ఆరోపించారు.
మంత్రి పీఏ తిరుపతే దీనికి ప్రధాన సూత్రధారి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ షాడో సీఎం అయితే, ఆయన పీఏ షాడో మంత్రి అని రేవంత్ అన్నారు.. మంత్రి పీఏ సొంతూరు జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలమని, రాజశేఖర్‌ది కూడా ఇదే మండలమని, గ్రూప్1 పరీక్షలో ఈ మండలానికి చెందిన 100 మందికి పైగా 103కు పైగా మార్కులు వచ్చాయని ఆరోపణలు గుప్పించారు. అయితే వీటిపై వివరాలు ఇవ్వాలని సిట్ కోరింది. పేపర్ లీక్ పై ఆరోపణలు చేసే రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే సిట్ నోటీసులు తనకు అందలేదని, అందితే స్పందిస్తానని రేవంత్ తెలిపారు.